Tsunami Warnings: జపాన్‌లో భారీ భూకంపం...సునామీ హెచ్చరికలు...అక్కడ వరుస సునామీలకు కారణం ఏంటంటే?

జపాన్ ఉత్తర తీర ప్రాంతం మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం, ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. అధికారులు వెంటనే అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

New Update
FotoJet - 2026-04-21T150519.968

Massive earthquake in Japan

Tsunami warnings: జపాన్ ఉత్తర తీర ప్రాంతం మరోసారి భారీ భూకంపం(japan earthquake tsunami) తో వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం(Earthquake In Japan), ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. అధికారులు వెంటనే అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక కాలమానం ప్రకారం,సోమవారం సాయంత్రం 4.54 గంటలకు ఉత్తర జపాన్‌లోని సన్రికు (Sanriku)ప్రాంతంలో ఈ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. సముద్ర మట్టానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read :  సుంకాల భారం తగ్గేనా ? అమెరికా-భారత్‌ మధ్య తుదిదశకు చేరుకున్న వాణిజ్య ఒప్పందం

సునామీ హెచ్చరికలు - తీర ప్రాంతాలపై ప్రభావం

భూకంపం సంభవించిన వెంటనే జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో సుమారు 10 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భూకంపం అనంతరం ఇవాటే ప్రిఫెక్చర్‌లోని కుజి పోర్ట్ వద్ద 80 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయి. మియాకో పోర్ట్‌లో 40 సెం.మీ., ఇతర ప్రాంతాల్లో 20-30 సెం.మీ. మేర అలలు ఎగసిపడ్డాయి. ఇవాటే, హొక్కైడో, అమోరి ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని సూచించారు.

స్తంభించిన రవాణా వ్యవస్థ

భూకంపం కారణంగా జపాన్‌లో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.భద్రతా కారణాల దృష్ట్యా టోక్యో – షిన్-అఒమోరి మధ్య నడిచే తోహోకు షింకన్సెన్ బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు.యమగాటా, అకితా షింకన్సెన్ సేవలతో పాటు, ఇవాటే ప్రాంతంలోని లోకల్ రైళ్లు, హొక్కైడోలోని కొన్ని రైలు మార్గాలను మూసివేశారు. అయితే, షిన్-చిటోస్ , సెండాయ్ విమానాశ్రయాల కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు స్పష్టం చేశారు.

భారతదేశానికి ముప్పు లేదు: జపాన్ భూకంపం వల్ల భారత్‌కు ఎటువంటి ప్రమాదం లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకటించింది."సునామీ ఏర్పడిన కేంద్రం నుంచి సుమారు 300 కిలోమీటర్ల పరిధిలోనే దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మన దేశంపై దీని ప్రభావం ఉండదు. సముద్రంలో వస్తున్న మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, ఒకవేళ ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే ప్రకటన విడుదల చేస్తాం" అని ఇంకాయిస్ పేర్కొంది.

Also Read :  ఏసు క్రీస్తు విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన ఇజ్రాయిల్

'మెగా భూకంపం' భయం 

ఈ తాజా భూకంపంతో జపాన్‌లో మరోసారి 'మెగా భూకంపం' చర్చ తెరపైకి వచ్చింది. జపాన్ భౌగోళికంగా పసిఫిక్, ఫిలిప్పీన్ సీ, యురేషియన్, నార్త్ అమెరికన్ అనే నాలుగు టెక్టోనిక్ ప్లేట్ల కలయిక వద్ద ఉండటం వల్ల అక్కడ భూకంపాలు సర్వసాధారణం. రాబోయే 30 ఏళ్లలో భారీ భూకంపం వచ్చే అవకాశం 70 శాతం ఉందని గతంలోనే నిపుణులు హెచ్చరించారు.2011 మార్చి 11న జపాన్‌లో సంభవించిన 9.0 తీవ్రత గల భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ వల్ల 22,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దెబ్బతినడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.ప్రస్తుతం అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే, రాబోయే వారం రోజుల పాటు 'ఆఫ్టర్ షాక్స్' (Aftershocks - ప్రకంపనలు) వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు