India-US: సుంకాల భారం తగ్గేనా ? అమెరికా-భారత్‌ మధ్య తుదిదశకు చేరుకున్న వాణిజ్య ఒప్పందం

భారత్‌-అమెరికా మధ్య ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తాజా చర్చల ద్వారా మిగిలిన కీలక అంశాలను పరిష్కరించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి.

New Update
India-US near trade deal in Washington

India-US near trade deal in Washington

భారత్‌-అమెరికా మధ్య ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(america trade deal with india) చివరి దశకు చేరింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తాజా చర్చల ద్వారా మిగిలిన కీలక అంశాలను పరిష్కరించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఏప్రిల్ 20 నుంచి 22 వరకు అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. భారత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి, ప్రధాన సంప్రదింపుదారు  దర్పణ్ జైన్ భారత బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ టీమ్‌లో వాణిజ్య శాఖతో పాటు కస్టమ్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సుమారు 12 మంది ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. ఇక అమెరికా తరపున యు.ఎస్. ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయానికి చెందిన బ్రెండన్ లించ్ నేతృత్వం వహిస్తున్నారు. 

Also Read: పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్ ?.. యుద్ధం ముగించే దిశగా ప్లాన్

అమెరికా-భారత్‌(us india) మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా ఉన్నాయని అమెరికా అధికారి వెల్లడించారు. మెజార్టీ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని.. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంలో పరిష్కారం కాని చిన్న సమస్యలను పరిష్కరించడంపైనే ఇరు బృందాలు ఫోకస్ పెట్టాయి. ఇరు దేశాల మధ్య సుంకాలు తగ్గించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం.  

10 శాతం అదనపు సుంకం

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా  10 శాతం సుంకాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంటే అమెరికాలోకి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై కనీసం 10 శాతం బేస్‌లైన్ సుంకం ఉండాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఈ 10% అదనపు సుంకం 150 రోజుల పాటు (జూలై 24, 2026 వరకు) అమల్లో ఉండనుంది. అయితే ఈ 10 శాతం సుంకం వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్త్రాలు , ఆభరణాలు, ఆటో విడిభాగాలు వంటి వస్తువుల ధరలు పెరిగిపోతాయి. దీంతో అక్కడ భారతీయ వస్తువులకు పోటీతత్వం తగ్గుతుంది. అందుకే భారత అధికారులు ఇప్పుడు వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతున్నారు. ఈ 10% సుంకం నుంచి భారతదేశానికి మినహాయింపు పొందడం లేదా ఇతర పన్నులను తగ్గించుకోవడం ద్వారా మన ఎగుమతిదారులకు నష్టం కలగకుండా చూడటమే ఈ వాణిజ్య ఒప్పందం ప్రధాన లక్ష్యం. 

Also Read: ఇరాన్‌కు చైనా భారీ షాక్ ..  హార్మూజ్ మీ సొత్తు కాదు.. వెంటనే తెరవండి!

ఇటీవల అమెరికా భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనం రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవడంతో ఫిబ్రవరి 2న భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం భారతీయ వస్తువులపై ప్రాథమికంగా 18 శాతం సుంకం అమల్లో ఉంది. కానీ ఫిబ్రవరి 24న అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై (సెక్షన్ 122 కింద) 10% తాత్కాలిక సర్ఛార్జ్ విధించింది. అయితే 18 శాతం సుంకాలను మరింత తగ్గించడానికి, కొత్తగా అమెరికా తీసుకొచ్చిన 10 శాతం అదనపు సుంకం భారాన్ని తొలగించుకోవడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి.

భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దీనిపై మాట్లాడారు. ఈ ఒప్పందానికి సంబంధించిన మొదటి దశ దాదాపు పూర్తయిందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో భారతీయ వస్తువులకు ప్రాధాన్యత లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే భారత్‌-అమెరికా మధ్య జరుగుతున్న ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో ఓ మైలురాయిగా నిలవనుంది. 

భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలకు 'విన్-విన్' (అందరికీ లాభదాయకం) అంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ మధ్య సహకారం పెరిగితే.. ఇది ప్రపంచ వాణిజ్య రంగంలోనే కీలక మార్పులకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు