Nandu World : యూకేలో ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు.. ‘నందూస్‌ వరల్డ్‌’ దంపతులపై కేసు

ప్రముఖ యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ లపై వచ్చిన మోసపూరిత ఆరోపణలు సంచలనంగా మారాయి. వారు పలువురిని మోసగించారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

New Update
nandu

Nandu World

Nandu World : ప్రముఖ యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ లపై వచ్చిన మోసపూరిత ఆరోపణలు సంచలనంగా మారాయి. వారు పలువురిని మోసగించారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమానందన దంపతులు ప్రస్తుతం యూకే (లండన్) లో స్థిరపడ్డారు. రమానందన 'నందూస్ వరల్డ్' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాపులారిటీని ఆసరాగా చేసుకుని, వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలలో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరిట కార్యాలయాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామంటూ ఈ కన్సల్టెన్సీ ద్వారా కార్యకలాపాలు సాగించేవారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్‌లో చదువుకునే రోజుల్లో మధుకర్‌తో పరిచయం ఏర్పడింది. లండన్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన శివ క్రాంతి కుమార్.. తన వీసా రెన్యూవల్ చేయించుకోవడంతో పాటు, తన భార్యకు 'సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్' (COS) మరియు ఉద్యోగ అవకాశాల కోసం మధుకర్‌ను ఆశ్రయించారు. ఇందుకు గాను గుంటూరులోని తమ కన్సల్టెన్సీ కార్యాలయంలో ఉన్న మధుకర్ తండ్రి మోహన్‌రావును కలవాలని, అక్కడ రూ. 15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించారు. ఆ మేరకు 2023లో శివ క్రాంతి కుమార్ నిందితులు సూచించిన రెండు బ్యాంకు ఖాతాలకు రూ. 15 లక్షల నగదును బదిలీ చేశారు.

నగదు చెల్లించిన రెండు నెలల తర్వాత, మధుకర్ 'అగార్డ్ సొల్యూషన్స్' అనే సంస్థ పేరుతో ఒక సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్‌ (COS) ను శివ క్రాంతి కుమార్‌కు పంపించారు. అయితే, దీనిపై అనుమానం వచ్చిన శివ సదరు సంస్థ యజమాని ఫైజల్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. తాను కొంతకాలం వేరే దేశంలో ఉన్నానని, ఆ సమయంలో తన ప్రమేయం లేకుండా మధుకర్ తప్పుడు లేదా నకిలీ లేఖను సృష్టించి ఉండవచ్చని ఫైజల్ స్పష్టం చేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన శివ క్రాంతి కుమార్.. తనకు ఉద్యోగం వద్దని, తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిలదీయగా, నందు దంపతులు కేవలం రూ. 2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఎగ్గొట్టారు.

బాధితుడు శివ క్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబరులోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు జాగర్లమూడి మధుకర్‌ను మొదటి నిందితుడిగా (A1), రమానందనను రెండో నిందితురాలిగా (A2) మరియు మోహన్‌రావును మూడో నిందితుడిగా (A3) చేర్చారు. కేసు నమోదైన తర్వాత పోలీసులు వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా, తమపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ (క్వాష్ చేయాలంటూ) నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

కేసు వివరాలు బయటకు రావడంతో కేవలం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా గుజరాత్, రాజస్థాన్, బిహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది వీరి చేతిలో మోసపోయినట్లు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 20 లక్షల చొప్పున వసూలు చేసి మోహంచాటేశారని, బాధితుల సంఖ్య మరియు వసూళ్ల మొత్తం చాలా పెద్ద మొత్తంలోనే ఉండవచ్చని సోషల్ మీడియా వేదికలపై వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ తీవ్రమైన ఆరోపణలపై యూట్యూబర్ రమానందన తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతోనే కొందరు ఇదంతా పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె కొట్టిపారేశారు. ఇప్పటికే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న కొందరిపై యూకేలో చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, వారే భారత్‌కు వచ్చి ఈ దుష్ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. తన పేరు మీద గానీ, తన భర్త పేరు మీద గానీ ఎలాంటి కంపెనీలు లేవని.. తమ పేర్లు వాడుకుని కొందరు అక్కడ సొమ్ము చేసుకుంటున్నారని, ఇటువంటి మోసపూరిత వ్యక్తులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు