/rtv/media/media_files/2026/03/17/donald-trump-2026-03-17-16-50-24.jpg)
Donald Trump says he will have the ‘honour’ of ‘taking Cuba in some form’
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబాను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటామని అన్నారు. ఆ దేశంలో ప్రస్తుతం విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి తరుణంలో ఆయన ఇలా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ క్యూబాను స్వాధీనం చేసుకునే ఛాన్స్ తనకు దక్కుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. నేను ఆశించింది ఏదైనా దక్కించుకోగలనని పేర్కొన్నారు.
క్యూబాపై అమెరికా చమురు ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో అక్కడ విద్యుత్ వ్యవస్థ పడిపోయింది. దేశంలో 96 లక్షల మంది ప్రజలు చీకట్లో చిక్కుకున్నారు. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా గత మూడు నెలలుగా క్యూబాకు ఎలాంటి ఇంధన రవాణా జరగలేదని క్యూబా అధ్యక్షుడు మిగెల్ దియాజ్ కానెల్ ఇటీవల వెల్లడించారు. మరోవైపు విద్యుత్ సరఫరాను పునురుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశ విద్యుత్ శాఖ వెల్లడించింది. ఇంతకీ అమెరికా, క్యూబా మధ్య నెలకొన్న విభేదాలు ఏంటి ? అసలు ట్రంప్ ఎందుకు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ఇంధన సంక్షోభం.. ఆ దేశంలో ఆగిపోయిన దహన సంస్కారాలు
అమెరికా,క్యూబా వైరం ఏంటి ?
అమెరికాకు క్యూబా 90 మైళ్ల దూరంలో ఉండే ఓ చిన్న ద్వీప దేశం. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పటివి కావు. దశాబ్దాల క్రితమే ఇవి మొదలయ్యాయి. 1959లో కమ్యూనిస్టు విప్లవం జరిగింది. ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. దీంతో క్యూబాకు అమెరికాతో సంబంధాలు అప్పుడే తెగిపోయాయి. ఆ తర్వాత అమెరికా కంపెనీల ఆస్తులను క్యూబా ప్రభుత్వం జాతీయం చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్యూబాపై వాణిజ్య ఆంక్షలు
అప్పటి సోవియట్ యూనియన్ అయిన రష్యాకు క్యూబాకు దగ్గరయ్యింది. అక్కడ రష్యన్ క్షిపణులను మోహరించేందుకు యత్నించడం కూడా అమెరికా భద్రతకు ముప్పుగా మారింది. దీంతో క్యూబాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా 1960 నుంచి వాణిజ్య ఆంక్షలు కొనసాగిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన ఏ కంపెనీ కూడా క్యూబాతో వ్యాపారం చేయకుండా నిషేధించారు. అలాగే క్యూబా నుంచి చక్కెర, సిగార్లు లాంటి వస్తువులను కొనుగోలు చేయడం ఆపేశారు. అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికన్ డాలర్లను క్యూబా వినియోగించకుండా నిషేధించారు. దీంతో వేరే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం క్యూబాకు కష్టతరంగా మారింది. చివరికి విదేశీ మారకద్రవ్యం తగ్గిపోవడంతో దేశం పేదరికంలోకి వెళ్లింది.
అమెరికా టూరిస్టులు క్యూబాకు వెళ్లడంపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. దీంతో అక్కడి హోటళ్లు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. చివరికి క్యూబా పర్యాట రంగంపై కూడా పెద్ద దెబ్బ పడింది. మరోవైపు క్యూబాకు చమురు దిగుమతులు లేక ఆ దేశంలో ప్రధాన పవర్ ప్లాంట్లు నడవడం ఆగిపోయాయి. కరెంట్ లేక లక్షలాది మంది చీకట్లో మగ్గిపోతున్నారు. అంతేకాదు ఆధునిక వైద్య పరికరాలు, మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల కొరత కూడా అక్కడ ఏర్పడింది.
క్యూబా తమ అవసరాల కోసం 70 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కానీ అమెరికా ఆంక్షల వల్ల వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులకు ఆహారం దొరకడమే కష్టతరంగా మారింది. అలాగే రవాణా వ్యవస్థ, భవనాల మరమ్మతులు చేయుంచలేక అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. క్యూబా వీధుల్లో చూసుకుంటే ఇప్పటికీ 1950ల నాటి పాత కార్లే కనిపిస్తుంటాయి.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో క్యూబాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు యత్నించారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఒబామా తీసుకున్న నిర్ణయాలు రద్దు చేసి క్యూబాను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల లిస్టులో చేర్చారు. అమెరికాలోని ఫ్లొరిడాలో ఎక్కువగా క్యూబా నుంచి వలస వచ్చినవారు ఉంటారు. వీళ్లు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. అందుకే వీళ్ల ఓట్ల కోసం ట్రంప్ క్యూబాపై కఠినంగా ఉంటారు.
Also Read: కాబుల్ ఆస్పత్రిపై దాడులు.. పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు
క్యూబాను సైనికపరంగా స్వాధీనం చేసుకునేదానికన్నా ముందు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ అనుకున్నారు. అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితులు రావాలని భావించారు. అక్కడ అమెరికాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే ట్రంప్ వ్యూహం. క్యూబాలో రష్యా తమ నిఘా స్థావరాలను ఏర్పాటు చేస్తోందని.. అలాగే చైనా గూఢచారి కేంద్రాలను నడుపుతోందని అమెరికా అనుమానిస్తోంది. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే క్యూబాను కూడా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. అందుకే తాజాగా క్యూబాను స్వాధీనం చేసుకుంటామంటూ వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ క్యూబాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us