Donald Trump : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్..చేతులెత్తేసిన బ్రిటన్, ఇటలీ, స్పెయిన్!

స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించినప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ మిత్రపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి.

New Update
trump

ఇరాన్, అమెరికా,  ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై ఐదు వారాలు గడుస్తున్నా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించినప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ మిత్రపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి. బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రేలియాతో పాటు ఇప్పుడు ఇటలీ కూడా ఇరాన్‌తో యుద్ధం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ట్రంప్ అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మిగిలిపోయారు.

అయోమయంలో ట్రంప్

అసలు ఇరాన్‌పై దాడి విషయంలో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకసారి ఇరాన్ చమురు బావులపై దాడి చేస్తామని, మరోసారి యురేనియం నిల్వలే లక్ష్యమని ఆయన మారుస్తూ మాట్లాడుతున్నారు. సొంత దేశంలో కూడా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశ ప్రజలను, విపక్షాలను సంప్రదించకుండానే ఇంత పెద్ద యుద్ధానికి దిగడం ట్రంప్ చేసిన చారిత్రక తప్పిదమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి మూతబడి ఉన్నా సరే, ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తన మిత్రదేశాలకు తెలిపినట్లు సమాచారం. అంతకుముందు రోజు ఇరాన్ గనుక నౌకల రాకపోకలను అడ్డుకుంటే ఆ దేశ పవర్ ప్లాంట్లు, చమురు బావులను ధ్వంసం చేస్తామని హెచ్చరించిన ట్రంప్, మరుసటి రోజే మెత్తబడటం చర్చనీయాంశమైంది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న ఈ మార్గాన్ని బలవంతంగా తెరిపించాలంటే యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని, అది తన లెక్కలను తలకిందులు చేస్తుందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్లిష్ట సమయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీసుకున్న నిర్ణయం అమెరికాకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇరాన్ యుద్ధం మాకు సంబంధం లేని విషయమని, తమ గగనతలాన్ని గానీ, సైన్యాన్ని గానీ ఈ యుద్ధం కోసం పంపబోమని ఆయన స్పష్టం చేశారు. అలాగే స్పెయిన్ సైతం అమెరికా యుద్ధ విమానాలు తమ దేశంలోని బేస్‌లను వాడుకోకుండా నిషేధం విధించింది. 

మరోవైపు ఇటలీ కూడా అమెరికా బాంబర్ విమానాలు తమ దేశంలో దిగడానికి అనుమతి నిరాకరించింది. ఒప్పందం ప్రకారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సంప్రదింపులు జరపకుండా అమెరికా విమానాలు రావడంపై ఇటలీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా వరుసగా మిత్రదేశాలన్నీ దూరం జరగడంతో ఇరాన్ విషయంలో అమెరికా వ్యూహం ప్రశ్నార్థకంగా మారింది.

Advertisment
తాజా కథనాలు