/rtv/media/media_files/2026/01/16/iran-1-2026-01-16-10-25-44.jpg)
.Iran to be vice-chair of NPT conference
NPT : ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో, ఐక్యరాజ్యసమితి వేదికగా ఆ దేశం సాధించిన దౌత్య విజయం అగ్రరాజ్యం అమెరికాకు మింగుడుపడటం లేదు. న్యూయార్క్‌లో జరుగుతున్న అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) సమీక్షా సమావేశానికి ఉపాధ్యక్షుడిగా ఇరాన్ ఎన్నిక కావడం ప్రపంచ దౌత్య వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఏ దేశంపై అయితే అణు ఆంక్షలు విధిస్తూ అమెరికా కట్టడి చేయాలని చూస్తోందో, అదే దేశం ఇప్పుడు ఆ నియమాలను పర్యవేక్షించే కీలక వేదికపై నాయకత్వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
Also Read : తెరమీదకు ‘కోహినూర్’ డిమాండ్.. ఇండియాకు ఇవ్వండి... మామ్దానీ సంచలన ప్రకటన
Iran To Be Vice Chair Of NPT Conference
ఈ కీలక పరిణామం వెనుక అలీన ఉద్యమం (NAM) దేశాల మద్దతు బలంగా నిలిచింది. ఇరాన్ పేరును నామ్ దేశాలే ప్రతిపాదించగా, మొత్తం 34 మంది ఉపాధ్యక్షులలో ఒకరిగా ఆ దేశం ఎన్నికైంది. ఇది కేవలం పరిపాలనాపరమైన పదవి మాత్రమే అయినప్పటికీ, అమెరికా, పాశ్చాత్య దేశాల నుండి నిరంతర ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్‌కు ఇది ఒక పెద్ద నైతిక , దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా ప్రపంచ వేదికపై తన గొంతును బలంగా వినిపించే అవకాశాన్ని ఈ నియామకం కల్పించింది.
అయితే, ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా ప్రతినిధి క్రిస్టోఫర్ యూ ఈ ఎంపికను ఎన్‌పిటి ఒప్పందానికి జరిగిన "అవమానం" గా అభివర్ణించారు. అణు పర్యవేక్షణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని తాము ఆరోపిస్తున్న దేశానికి, అణు నిరాయుధీకరణపై చర్చించే వేదికపై కీలక బాధ్యతలు అప్పగించడం ఏంటని అమెరికా ప్రశ్నిస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ స్పందిస్తూ.. అమెరికా తన ద్వంద్వ ప్రమాణాలతో దౌత్య వేదికలను రాజకీయం చేస్తోందని ఘాటుగా విమర్శించింది.
1970లో అమల్లోకి వచ్చిన ఎన్‌పిటి ఒప్పందం అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టడం, అణు సాంకేతికతను శాంతియుత అవసరాలకు (విద్యుత్ వంటివి) వాడటం, నిరాయుధీకరణ అనే మూడు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తుంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున ఇరాన్‌కు తక్షణమే నిర్ణయాలను మార్చే అధికారం రాకపోయినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై తన ప్రతిష్టను పెంచుకోవడానికి , పాశ్చాత్య దేశాల వాదనలను తిప్పికొట్టడానికి ఒక బలమైన వేదిక దొరికినట్లయింది. ఈ పరిణామం అగ్రరాజ్యాల పట్టుకు సవాలుగా మారుతుందో లేదో వేచి చూడాలి.
Also Read : అమెరికా దిగ్బంధనం, ఆంక్షల ప్రభావం.. కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ
Follow Us