పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్..

మిడిల్ ఈస్ట్ లో రాజకీయ, సైనిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ తెరవెనుక దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

New Update
Asim Munir preparing to dethrone Pakistan President Asif Ali Zardari, Sources

Asim Munir

Iran US conflict  : పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో రాజకీయ, సైనిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ తెరవెనుక దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ శుక్రవారం అర్ధరాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో అత్యంత ప్రాధాన్యత కలిగిన భేటీ నిర్వహించారు 

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చింది. ముఖ్యంగా అమెరికా చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది.అక్కడ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో అర్ధరాత్రి జరిగిన ఈ సమావేశంలో.. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాల ద్వారా యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా పాకిస్థాన్ ఈ మధ్యవర్తిత్వాన్ని నడుపుతోంది.

 ఈ సంక్షోభంపై అమెరికా వైపు నుంచి భిన్నమైన సంకేతాలు వస్తున్నాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రుబియో ఈ శాంతి చర్చలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా శాంతి ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఒకవేళ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే, ఇరాన్‌పై కొత్త సైనిక చర్యలకు దిగడానికి కూడా తాము వెనకాడబోమని మార్కో రుబియో స్పష్టం చేశారు. దీంతో పశ్చిమాసియాలో ఉత్కంఠ మరింత పెరిగింది.

 దౌత్య ప్రయత్నాలు ఒకవేళ ఫలించకపోతే, ఇరాన్‌పై మరోసారి భారీ దాడులు చేయడానికి అమెరికా సన్నద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. సైనిక చర్యకు దిగే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.దీనిపై వ్యూహాన్ని ఖరారు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఒక ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి (డిఫెన్స్ సెక్రటరీ) పీట్ హెగ్సెత్ లతో పాటు అమెరికా సైనిక, దౌత్య విభాగానికి చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితి కత్తిమీద సాములా మారింది. ఒకవైపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ నేతృత్వంలో టెహ్రాన్ వేదికగా ముమ్మర చర్చలు జరుగుతుండగా.. మరోవైపు అమెరికా తన యుద్ధ సన్నద్ధతను ప్రదర్శిస్తోంది.ఈ దౌత్య ప్రయత్నాలు సఫలమై శాంతి ఒప్పందం కుదురుతుందా, లేదా అమెరికా సైనిక చర్యకు దిగి పశ్చిమాసియాను మరో పెద్ద యుద్ధంలోకి నెడుతుందా అనేది రాబోయే కొన్ని గంటల్లో తేలనుంది. ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం టెహ్రాన్, వాషింగ్టన్ వైపే ఉత్కంఠగా చూస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు