AUKUS : సముద్ర గర్భంలో సరికొత్త యుద్ధ వ్యూహం: చైనాకు 'ఆకస్' (AUKUS) గండం!

ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో చైనా దూకుడుకు అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల AUKUS కూటమి భారీ రక్షణ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సముద్ర గర్భాన్ని వేదికగా చేసుకుని సరికొత్త సాంకేతిక పోరాటానికి ఇవి శ్రీకారం చుట్టాయి.

New Update
FotoJet (60)

AUKUS

AUKUS  : ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల 'ఆకస్' (AUKUS) కూటమి ఒక భారీ రక్షణ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సముద్ర గర్భాన్ని వేదికగా చేసుకుని సరికొత్త సాంకేతిక పోరాటానికి ఇవి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా సముద్ర అంతర్భాగంలో శత్రువుల కదలికలను ముందే పసిగట్టే అత్యంత శక్తివంతమైన, మానవరహిత 'అండర్‌వాటర్ డ్రోన్' (జలాంతర్గామి డ్రోన్) టెక్నాలజీని ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ అత్యాధునిక ప్రాజెక్టుకు సంబంధించిన తొలి విడత రక్షణ సామర్థ్యాలను 2027 నాటికే అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మూడు దేశాలు అడుగులు వేస్తున్నాయి.

సింగపూర్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 'షాంగ్రి-లా డైలాగ్' సదస్సు వేదికగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ ఉమ్మడి ప్రకటన చేశారు. 2021లో ఏర్పడిన ఆకస్ కూటమి రక్షణ ఒప్పందాల్లోని "పిల్లర్-2" విభాగం కింద ప్రకటించిన మొదటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం. ఈ డ్రోన్లు కేవలం నిఘా పెట్టడానికే పరిమితం కాకుండా.. శత్రు దేశాల సబ్‌మెరైన్లను గుర్తించడం, నీటి అడుగున అమర్చిన ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను నడపడం వంటి బహుముఖ వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో శత్రువుల లక్ష్యాలపై నేరుగా దాడులు చేసే వినాశకర సామర్థ్యాన్ని కూడా వీటికి కల్పిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న మరో ప్రధాన కారణం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న ప్రపంచ డిజిటల్, ఇంధన వ్యవస్థలను రక్షించుకోవడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 95 శాతం సముద్రం అడుగున ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే సాగుతోంది. దీనితో పాటు అనేక దేశాల గ్యాస్, చమురు పైప్‌లైన్లు కూడా సముద్ర గర్భంలోనే ఉన్నాయి. ఇటీవల బాల్టిక్ సముద్రం, తైవాన్ జలసంధి ప్రాంతాల్లో ఈ అండర్‌సీ కేబుళ్లు దెబ్బతినడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. సముద్ర గర్భం ఇప్పుడు కొత్త యుద్ధ రంగంగా మారుతోందని గుర్తించిన ఆకస్ కూటమి, ఈ ముప్పుల నుంచి కీలక మౌలిక వసతులను కాపాడుకోవడానికి ఈ డ్రోన్ల రక్షణ కవచాన్ని వాడుకోవాలని నిశ్చయించుకుంది.

ఈ డ్రోన్ల తయారీ కోసం జీపీఎస్ (GPS) సిగ్నల్స్ కూడా అందని సముద్రపు చీకటి కోణాల్లో స్వతంత్రంగా ప్రయాణించే నెట్‌వర్కింగ్ వ్యవస్థలను మూడు దేశాలు కలిసి తయారు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిర్ణయాత్మక సామర్థ్యం, సెన్సర్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీని సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. కాగా, ఈ ఆకస్ (AUKUS) కూటమి ప్రధానంగా రెండు భాగాలుగా పనిచేస్తోంది. "పిల్లర్-1" కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే సంప్రదాయ జలాంతర్గాముల సాంకేతికతను అందిస్తుండగా, "పిల్లర్-2" కింద ఏఐ, హైపర్‌సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ వంటి భవిష్యత్ తరం రక్షణ ఆయుధాలపై పరిశోధనలు సాగిస్తోంది.

అంతర్జాతీయ రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ మెగా ప్లాన్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఇండో-పసిఫిక్ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న చైనా నౌకాదళాన్ని నిలువరించడమే. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ చూపిస్తున్న నౌకాదళ దూకుడుకు అడ్డుకట్ట వేసి, సముద్ర మార్గాలపై తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు ఈ ప్రాజెక్టును వేగవంతం చేశాయి. అయితే చైనా మాత్రం ఈ రక్షణ ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. ఆకస్ కూటమి చర్యలు ప్రాంతీయ శాంతిని దెబ్బతీస్తాయని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇది ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందని చైనా హెచ్చరిస్తోంది.

Advertisment
తాజా కథనాలు