EVM Hacking: భారత్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈవీఎం హ్యాకింగ్..

ఈవీఎంలను వినియోగించకూడదని.. వీటిని హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని టెస్లా అధినేత చేసిన ట్వీట్ భారత్‌లో దుమారం రేపుతోంది. మస్క్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు స్పందిస్తుంటే మరోవైపు కాంగ్రెస నేతలు ఆయన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు.

New Update
EVM Hacking: భారత్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈవీఎం హ్యాకింగ్..

EVM Hacking Row: మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించకూడదు... వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి త్రీవ నష్టాన్ని కలిగిస్తుంది..' టెస్లా మోటర్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన ఈ ట్వీట్‌ ఇండియాలో పెను దుమారానికి కారణమైంది. భారత్‌ ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈవీఎంలపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల పనితీరుపై రాహుల్‌గాంధీ లాంటి నేతలు ఏనాటి నుంచో సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక మస్క్‌ సైతం ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని కామెంట్‌ చేయడం.. దీనికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడంతో EVM వార్‌ ముదిరింది.

Also Read: గర్భిణికి ఆర్టీసీ మహిళ సిబ్బంది కాన్పు.. స్పందించిన సీఎం రేవంత్

48 ఓట్ల తేడాతో గెలుపు 

ఇటీవల మహారాష్ట్రలో ఈవీఎంలను ఓటీపీ ద్వారా అన్‌లాక్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ముంబై నార్త్‌వెస్ట్‌ నుంచి బరిలోకి దిగిన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్‌ (Ravindra Waikar) బంధువు మొబైల్ ఫోన్‌ వినియోగించారని ఆరోపిస్తూ.. పలువురు విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నియోజకవర్గంలో షిండే గ్రూపుకు చెందిన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఎన్నికల అధికారి మొబైల్‌ఫోన్‌తో ఓటీపీ ద్వారా ఈవీఎం అన్‌లాక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎన్నికల సంఘం (Election Commission) స్పందించింది. ఈవీఎంలను అన్‌లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని, ఇవి దేనికి కూడా కనెక్ట్ కావని తేల్చి చెప్పింది.

ఈవీఎం హ్యాక్ సాధ్యం కాదు

అటు రాహుల్‌ గాంధీ ఈవీఎంలపై తన పోరును కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మస్క్‌ ట్వీట్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ ఈవీఎంలు 'బ్లాక్‌ బాక్స్‌' లాంటివని కామెంట్ చేశారు. సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ ఉపయోగించాలని.. కానీ అదే టెక్నాలజీ సమస్యలకు కారణమైతే వాటిని పక్కన పెట్టాలన్న అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు. ఇటు ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ సైతం ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతోంది. అటు ఈవీఎం ట్యాంపరింగ్‌కు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగలేదని భారత ఎన్నికల సంఘం చెబుతోంది. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని సమర్థించింది.

అవి, ఇవి ఒకటి కావు 

అటు భారత్‌ టెక్‌ నిపుణులు సైతం ఈవీఎంలు హ్యాక్ అయ్యే ఛాన్స్ లేదని చెబుతున్నారు. భారత్‌ ఈవీఎంలు, ఇతర దేశాల్లో వాడుతున్న ఈవీఎంలు ఒకటి కాదని అంటున్నారు. నిజానికి భారత్‌లో థర్డ్‌ జనరేషన్‌ ఈవీఎం సిస్టమ్‌ను వాడుతున్నారు. ఇవి ఇంటర్‌నెట్‌కు కనెక్ట్‌ అవ్వవని.. ఎలాంటి బ్లూ టూత్‌ లేదా వైఫైకి లింక్‌ అవ్వవని టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకుండా హ్యాకింగ్‌ చేయడం చాలా కష్టమైన విషయమని..అలాంటిది అసలు నెట్‌ కనెక్షనే లేని భారత్‌ ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఈవీఎంలు వేరు అని గుర్తు చేస్తున్నారు.

Also Read: తాను గెలిస్తే…వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొడతా-ట్రంప్

మరోవైపు ప్రతిపక్షాల వాదన మాత్రం వేరేలా ఉంది. అసలు పోలింగ్‌ రోజు పోలైన ఓట్లకు, రిజల్ట్‌ రోజు వచ్చే ఓట్లకు గ్యాప్‌ ఎందుకు ఉంటుందో ఈసీ చెప్పాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ప్రముఖ వెబ్‌సైట్లు ది క్వింట్‌, ది వైర్ ఇప్పటికే సొంతంగా ఈవీఎంల పనితీరుపై ఇన్‌వెస్టిగేషన్‌ చేశాయి. ఈ మెషీన్‌లోని లోపాలను ఎత్తిచూపాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారా పోల్ అయిన ఓట్లలో మొత్తం 5,54,598 ఓట్లు గల్లంతైనట్టుగా 'ది క్వింట్‌' రిపోర్ట్ చేసింది. ఇందులో ఏపీలోని పలు నియోజకవర్గాలు కూడా ఉండడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అటు యూరప్‌, ఉత్తర అమెరికాలోని దేశాలు ఈవీఎంలకు దూరంగా ఉన్నాయి. ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, అమెరికా తదితర దేశాలు పారదర్శకత లోపించిందని ఈవీఎంలను నిషేధించాయి. ఈవీఎంలను నిషేధించిన దేశాలన్నీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు కావడంతో మన దేశంలో కూడా పలు పార్టీలు ఇదే విధమైన డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు