/rtv/media/media_files/2026/03/30/karnataka-2026-03-30-19-17-33.jpg)
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి పట్టణంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక గుర్తుతెలియని వ్యక్తి అర్థరాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి, కేవలం మహిళల లోదుస్తులను మాత్రమే దొంగిలిస్తుండటంతో కాలనీవాళ్లు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా మహిళలను భయాందోళనలకు గురిచేస్తోంది. గంగావతి నగరంలోని అత్యంత రద్దీగా ఉండే, CBS లేఅవుట్‌లో గత నాలుగు రోజులుగా ఈ వింత దొంగతనాలు జరుగుతున్నాయి. పగటిపూట సాధారణంగానే ఉండే ఈ ప్రాంతంలో, చీకటి పడగానే ఒక వ్యక్తి గోడలు దూకి ఇళ్ల లోపలికి ప్రవేశిస్తున్నాడు. అయితే, అతను ఇంట్లోని విలువైన వస్తువులనో, నగలను లేదా నగదునో దొంగిలించడం లేదు. కేవలం బయట వైర్లపై ఆరవేసిన మహిళల లోదుస్తులను మాత్రమే ఎత్తుకెళ్తున్నాడు.
వరుసగా లోదుస్తులు మాయమవుతుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు తమ ఇళ్లకు ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక వ్యక్తి నేర్పుగా ప్రహరీ గోడలు దూకి, లోపలికి వచ్చి లోదుస్తులను దొంగిలించడం స్పష్టంగా రికార్డయ్యింది. ఈ వీడియో క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పట్టణవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి ప్రవర్తనను చూస్తుంటే అతను ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్న 'సైకో' అయి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస దొంగతనాలతో విసిగిపోయిన బాధితులు, ఆందోళన చెందుతున్న మహిళలు గంగావతి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు మహిళలు ఈ వింత చోరీలపై పోలీసులకు తమ ఫిర్యాదులను అందజేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. రాత్రి సమయాల్లో గస్తీని పెంచాలని, ఆ దొంగను త్వరగా పట్టుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
మహిళల్లో పెరుగుతున్న ఆందోళన
కేవలం లోదుస్తుల దొంగతనమే కదా అని కొట్టిపారేయడానికి వీల్లేదని, అర్ధరాత్రి పూట పరాయి వ్యక్తి ఇళ్లలోకి చొరబడటం తమ భద్రతకు ముప్పు అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి మరెంతకైనా తెగించవచ్చనే భయం వారిని వెంటాడుతోంది. పోలీసులు నిందితుడిని పట్టుకునే వరకు తమకు నిద్ర పట్టేలా లేదని సీబీఎస్ లేఅవుట్ నివాసితులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు
Follow Us