/rtv/media/media_files/2025/04/01/9ujbyv4Ha1PRfRP6FwMJ.jpg)
cigarette
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు వదిలిన సిగరెట్ పొగ మరో యువకుడి పైకి వెళ్లడంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి దారుణంగా కొట్టి చంపేశారు.ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో చోటుచేసుకుంది. పర్వతగిరి సీఐ రాజగోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగెం మండలం కుంటపల్లికి చెందిన చిర్ర ధని, అతడి సోదరుడు చిర్ర బన్నీ (21), తల్లి పూల, సోదరి పూజిత, స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఆదివారం రాత్రి గవిచర్లలో జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోగా.. బన్నీ మాత్రం తన స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాడు. ఈ సమయంలో బన్నీ ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్నాడు.
అయితే అతడు వదిలిన సిగరెట్ పొగ పక్కనే ఉన్న గవిచర్లకు చెందిన వేల్పుల సిద్ధు వైపుకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. అక్కడే ఉన్న సిద్దు అన్న వినయ్ వారికి నచ్చజెప్పి సిద్దుతో సారీ చెప్పించి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే దీన్నే మనసులో పెట్టుకున్న సిద్దు.. తన మేనమాము గుండేటి సునీల్, ఫ్రెండ్స్ గుండేటి రాజు, కార్తీక్, మహేందర్, మెట్టుపల్లి భరత్, చిన్న భరత్, రాజ్కుమార్, కొమ్మాలుతో కలిసి వచ్చి బన్నీపై దాడికి దిగాడు. ఇదంతా గమనించిన స్థానికులు బన్నీని కాపాడేందుకు చాలానే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడ్డ బన్నీ అక్కడే కుప్పకూలిపోయాడు. సిద్దు తన ఫ్రెండ్స్ తో అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు బన్నీని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి అన్న ధని ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
గ్రూప్స్ కు సెలెక్ట్ కాలేదని
ఇక మరో ఘటనలో గ్రూప్స్ కు సెలెక్ట్ కాలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ లో చోటుచేసుకుంది. కథలాపూర్ మండల కేంద్రానికి ఆకుల శృతి (27) పీజీ వరకు చుదువుకుంది. మంచి జాబ్ రావాలని గ్రూ ప్స్ కు కొంతకాలగా ప్రిపేర్ అవుతోంది. అయితే ఇటీవల విడుదలైన గ్రూప్స్ పరీక్షలో విజయం సాధించలేకపోయింది. దీంతో చదువు కోసం తన తల్లిదండ్రులు పెట్టిన డబ్బులు వృథా అయ్యాయన్న మనస్తాపంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.