Israel-Hamas conflict:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం - హృదయ విదారకంగా గాజా

యుద్ధాలు ఎప్పుడూ మానవ మనుగడకు ప్రమాదమే. ఇవి మనుషులకు ఎప్పుడూ శాంతిని ఇవ్వలేవు. యుద్ధం అయిపోయాక భవిష్యత్తులో చరిత్ర పాఠాలుగా చదువుకోవచ్చునేమో కానీ అది జరుగుతున్నప్పుడు మాత్రం అన్నిరకాలుగా నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇందుకు నిదర్శనమే ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య వార్.

New Update
Israel-Hamas conflict:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం - హృదయ విదారకంగా గాజా

హమాస్ మొదలుపెట్టిన మారణకాండను ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. తమ దేశంలో హమాస్ సృష్టించిన విధ్వంసానికి ప్రతీకారంగా, వారి చేతుల్లో తమ బందీలను విడిపించుకునే దిశగా ఇజ్రాయెల్ వరుసపెట్టి గాజాలో దాడులు చేస్తోంది. మరోవైపు హమాస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నా లెక్క చేయడం లేదు. తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడిచిపెట్టడం లేదు. కానీ ఈ రెండింటి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక, సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడిలో హమాస్ మిలిటెంట్లు ఎంత మంది చనిపోతున్నారో తెలియదు కానీ.. గాజాలో ఉంటున్న వందలాది మంది సామాన్య ప్రజలు మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా అబంశుభం తెలియని చిన్నారులు లోకాన్ని ఇంకా పూర్తిగా చూడకముందే కళ్ళు మూస్తున్నారు.

గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న బాంబు దాడుల్లో వేల సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కొంతమంది అక్కడికక్కడే మరణిస్తుండగా.. మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడుస్తున్నారు. గాజాలో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని పోగొట్టుకుని అనాథలుగా మిగిలిపోయారు. చుట్టూ భీభత్సం జరుగుతోంది. కానీ ఎందుకు అవుతోంది.. ఎలా అవుతోంది.. ఎవరు చేస్తున్నారు ఏమీ తెలియని పసి మనసులు ఈ ఉత్పాతానికి అల్లకల్లోలం అవుతున్నారు. ఇక ఈ దాడులు కడుపులో ఉన్న పసికందులను సైతం విడిచిపెట్టడం లేదు. ఈ భీకర, హృదయవిదారక ఘటనకు సంబంధించిన సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియా నిండిపోతోంది. వీడియోల్లో చిన్నారుల పరిస్థితులు మనసులను కలిచివేసేవిగా ఉంటున్నాయి.

Also read:అసలేంటీ గగన్‌యాన్..ఇస్రో ఎందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది?

మరోవైపు దక్షిణ గాజా మీద కూడా ఇజ్రాయెల్ వరుస బాంబులతో దాడులు చేస్తూనే ఉంది. అక్కడి ఖాన్ యూనిస్ పట్టణం మీద బాంబుల మోత మోగించింది. నిన్న జరిగిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఖాన్ యూనిస్‌లో ఆంబులెన్స్‌ల సైరన్ మోగుతూనే ఉంది. గాజాలో అతి పెద్ద రెండో ఆసుపత్రి అయిన నాసర్ లో క్షతగాత్రులు జాయిన్ అవుతూనే ఉన్నారు. బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ లేక, అత్యవసర వస్తువులు లేక అక్కడి వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ ఫోన్ లైట్లలో ఆపరేషన్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటిదాకా గాజాలో 4,137 మంది చనిపోగా.. 13వేలమందికి పైగా గాయపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు