BJP Plan : ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది 

మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక స్వపక్షానికే  కాకుండా విపక్షాలకూ షాక్ ఇచ్చింది. దీనిపై పూర్తి విశ్లేషణ హెడింగ్ పై క్లిక్ చేసి చూడవచ్చు. 

New Update
BJP Plan : ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది 

BJP Changes Game Plan  : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ..అదీ  సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా.. ఈ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే మొన్న జరిగిన ఎన్నికలను సెమీఫైనల్స్ గా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తూ పోయాయి పార్టీలన్నీ. నిజమే.. ఇది సెమీఫైనల్ సమరమే. దేశంలో రెండు ప్రధాన పార్టీలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో సూచన ప్రాయంగానైనా ఈ ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉంది. ఆ కోణంలో ఇది సెమీఫైనల్. అయితే, బీజేపీ(BJP Plan) ఈ సెమీఫైనల్ ని ఫైనల్స్ కి పెద్ద మెట్లుగా చేసుకునే దిశలో ఇప్పుడు అడుగువేస్తోంది. మూడు కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఈ ఎన్నికల్లో అధికారం సాధించింది. మూడు చోట్ల కూడా సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకుండా.. కేవలం ప్రధాని మోదీ విధానాలు.. మోదీ ప్రచారంతోనే ఎన్నికల్లో తలపడింది. దీంతో మూడు చోట్ల గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇప్పటికీ (ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతోంది) సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లకు ముఖ్యమంత్రులను ప్రకటించింది బీజేపీ. అందరి ఊహలకూ భిన్నంగా.. ఏ రాజకీయ అంచనాలకు అందకుండా.. తరువాతి సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ఈ రెండు చోట్లా ముఖ్యమంత్రి ఎంపిక సాగింది. స్వపక్షానికి.. విపక్షానికి కూడా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అసల్లు బీజేపీ వ్యూహం ఏమై ఉంటుంది అని అందరూ ఊహాగానాలు మొదలు పెట్టారు ఇప్పుడు. 

ముందుగా ఛత్తీస్ గఢ్ ను తీసుకుంటే.. అక్కడ గిరిజన సంఘం నాయకుడు విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాష్ట్రానికే కాకుండా గిరిజన సమాజానికి తాము ఎప్పుడూ అనుకూలంగా ఉంటామనే సంకేతాలు బలంగా పంపించింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా గిరిజన నియోజక వర్గాలలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేసింది బీజేపీ(BJP Plan) అధిష్టానం. గిరిజనుల్ని బుట్టలో వేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే బీజేపీకి గిరిజన నియోజకవర్గాల్లో బలమైన పట్టు ఉంది. గిరిజనులకు రిజర్వ్ చేసిన మొత్తం 47 సీట్లలో 31 సీట్లను బీజేపీ గత ఎన్నికల్లో(2019) కైవసం చేసుకుంది. ఇప్పడు మొత్తం 47 సీతాలను గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. దేశంలోని ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మరియు జార్ఖండ్‌లలో 31 శాతానికి పైగా గిరిజన ఓటర్లు ఉన్నారు. గతంలో గిరిజనుల ఓట్లపై ఏ ఒక్క పార్టీకి పట్టులేదు. గత రెండు దశాబ్దాలుగా బీజేపీ వారిని ఓటు బ్యాంకులుగా ఏర్పాటు చేసుకున్నదనేది స్పష్టం. ఇది బీజేపీ మిషన్ గిరిజన. 

అయితే, మిషన్ గిరిజనకు ఛత్తీస్ గఢ్ ఎన్నికలతోనే  శ్రీకారం చుట్టలేదు. గిరిజన సమాజం నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్న మొదటి మహిళ అయిన ద్రౌపది ముర్మును దేశ అధ్యక్షురాలిగా నియమించడంతోనే బీజేపీ గిరిజన మిషన్ ప్రారంభామ అయింది.  దీని తరువాత, జార్ఖండ్‌లోని గిరిజన సమాజం నుంచి  వచ్చిన బాబులాల్ మరాండీ తిరిగి బిజెపికి తిరిగి వచ్చారు. ఆయనకు జార్ఖండ్‌లో పార్టీ కమాండ్‌ను అప్పగించారు. అదే సమయంలో, ఛత్తీస్‌గఢ్‌లో, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బిజెపి(BJP Plan) ఇప్పుడు పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. 

దేశంలోని మొత్తం గిరిజనుల జనాభా 10 కోట్లు, అంటే 8 నుంచి 9 శాతం మధ్య ఉంటుంది.  2011 జనాభా లెక్కల ప్రకారం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ - గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అత్యధిక జనాభా గిరిజనులు నివసిస్తున్నారు. 5 నుంచి 35 శాతం గిరిజన జనాభా ఉన్న దాదాపు 18 రాష్ట్రాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన ఓటర్లకు రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గిరిజన సమాజాన్ని కాంగ్రెస్ సంప్రదాయ ఓటరుగా పరిగణిస్తారు, అయితే బిజెపి(BJP Plan) వారిని తమవైపు తిప్పుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ బనవాసి కళ్యాణ్ ఆశ్రమం కూడా బీజేపీ ఈ ప్రచారానికి సహకరిస్తూ వస్తోంది. 

ఇదీ ఛత్తీస్ గఢ్ లో బీజేపీ గిరిజన ముఖ్యమంత్రి ఎంపిక వెనుక కథ. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా బీజేపీ(BJP Plan) వ్యవహరిస్తోంది. దీనికోసం బీజేపీ సంప్రదాయ విధానాలను చాలావరకూ పక్కన పెట్టేసింది. మోదీ-షా ద్వయం రాజకీయ విన్యాసాల్లో మిషన్ గిరిజన ఒకటి అని చెప్పవచ్చు. 

Also Read: లేట్ అయినా లేటెస్టుగా..రాజస్థాన్ లోనూ బీజేపీ కొత్త ఫార్ములా.. 

ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బీజేపీ మరో ఆశ్చర్యకరమైన.. అడుగు వేసింది. ఎవరూ ఊహించని విధంగా ఇక్కడ ముఖ్యమంత్రిని ప్రకటించడం ద్వారా రాబోయే ఎన్నికలకు తన వ్యూహాలు ఎంత పదునుగా ఉన్నాయో స్పష్టం చేసింది. ఛత్తీస్ గఢ్ లో అనుసరించిన దాదాపు అదే వ్యూహాన్ని తిరిగి మరింత బలంగా మధ్యప్రదేశ్ లో చూపించింది.  ఎక్కడా కూడా చర్చకు కూడా రాని అనూహ్యమైన పేరును ముఖ్యమంత్రి పదవికి తీసుకువచ్చింది. ఈ పేరు మోహన్ యాదవ్.

మోహన్ OBC వర్గం ముంచి వచ్చిన- ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే. ఒకవైపు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి మోహన్ యాదవ్ ప్రతిపాదనను ప్రధాని రాబట్టి, మరోవైపు అంతా బాగానే ఉందంటూ సందేశం ఇచ్చారు. ఈ పేరుతో బీజేపీ  ఉత్తరప్రదేశ్‌ను కూడా టార్గెట్చేసింది.  మోహన్ యాదవ్ (MY) అతని అత్తమామల ఇల్లు సుల్తాన్‌పూర్ జిల్లాలో ఉంది. అందువల్ల ఆయనకి UPలో కూడా పట్టు ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో గోండా ఇంచార్జ్‌గా కూడా ఉన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 'మోదీ మోహన్' ట్రంప్ కార్డ్‌గా మారనున్నారు. మోహన్ యాదవ్ సహాయంతో, ప్రధాని మోడీ అఖిలేష్ యాదవ్ రాజవంశ రాజకీయాలనుటార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ లో ఉన్న మొత్తం 52% OBC ఓటర్లలో 20% యాదవులు ఉన్నారు. వీరికి యాదవులు SPలోనే కాకుండా BJPలో కూడా ఉన్నత పదవులు చేపట్టవచ్చని గట్టి సందేశం ఇచ్చింది.  యూపీలో ఎందుకు యాదవులు అంత ప్రధానమైన ఓటు బ్యాంకు అనేది చూద్దాం.. 

ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకూ ఐదుగురు ముఖ్యమంత్రులు యాదవుల నుంచి వచ్చారు. అందుకే ఆ ఓటు బ్యాంకుపై కన్నేసింది బీజేపీ(BJP Plan). యూపీ రాజకీయం మొత్తం ఓబీసీ ఓటు బ్యాంకు చుట్టూనే తిరుగుతోంది. అంచనా వేసిన లెక్కల ప్రకారం, UPలో OBC ఓటు బ్యాంకు దాదాపు 52%. వీటిలో అత్యధికంగా 20% యాదవులదే  ఓటు బ్యాంకు. ఈ OBC సమాజంలో 79 కులాలున్నాయి. కుర్మీ సంఘం యాదవుల తర్వాత రెండవ స్థానంలో ఉంది. CSDS డేటా ప్రకారం, రాష్ట్ర జనాభాలో యాదవుల వాటా 11%, ఇది SP సంప్రదాయ ఓటరుగా పరిగణిస్తారు.  యాదవేతర OBC కులాల్లో అత్యధిక సంఖ్యలో కుర్మీ-పటేల్ 10%, కుష్వాహా-మౌర్య-షాక్యా-సైని 6%, లోధ్ 4%, గడారియా-పాల్ 3%, కుమ్హర్/ప్రజాపతి-చౌహాన్ 3%, రాజ్‌భర్ 2% - గుర్జార్ ఉన్నారు. 2%..

ఉత్తరప్రదేశ్‌లో, ఇటావా, మెయిన్‌పురి, ఎటా, ఫరూఖాబాద్, కన్నౌజ్, అజంగఢ్, ఫైజాబాద్, బల్లియా, సంత్ కబీర్‌నగర్ - కుషీనగర్‌లతో సహా అనేక జిల్లాల్లో యాదవ్ కమ్యూనిటీ ఆధిపత్యం చెలాయించింది. బ్రాహ్మణ-ఠాకూర్ రాజకీయాలు, మాయావతి దళిత రాజకీయాలు కాకుండా, యాదవ సామాజికవర్గం నుంచి  5 సార్లు UP ముఖ్యమంత్రిగా కేవలం OBCలు - ముస్లింల బలంతోనే వారు పని చేశారనే వాస్తవం నుంచి యాదవుల  రాజకీయాల బలాన్ని అంచనా వేయవచ్చు. ఇప్పుడు కేవలం ముస్లిం ఓటు బ్యాంకుకే అఖిలేష్ యాదవ్‌ను పరిమితం చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. యాదవులను ఆకర్షించడంతో పాటు కుర్మీ కమ్యూనిటీ, మల్లా-నిషాద్, లోధ్ కమ్యూనిటీ, రాజ్‌భర్, మౌర్య సహా 78 ఓబీసీ కులాలను కూడా తనవైపుకు తీసుకురావాలని కోరుకుంటోంది. 

Also Read: ‘ఫ్యాన్’ ఊగిసలాట.. 24 గంటల్లో ఇంత జరిగిందా!.. వైసీపీలో ప్రకంపనలు

CSDS ప్రకారం, UPలోని అన్ని OBC కులాలలో యాదవ్ ఓటర్ల వాటా దాదాపు 20%. యూపీలోని మొత్తం 11 శాతం యాదవుల జనాభాలో 90 శాతం ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి వచ్చాయి. మోడీ మోహన్ ఇప్పుడు ఈ ఓటు బ్యాంకుకు ట్రంప్ కార్డ్‌గా మారారు. యాదవులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించి ఈ ఓటు బ్యాంకును తనవైపుకు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.మధ్యప్రదేశ్‌ అధికారాన్ని మై అంటే మోహన్‌యాదవ్‌కు అప్పగించడం ద్వారా.. ఈ ఓటు బ్యాంకును తమవైపుకు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యాదవులకు అధికారంలో వాటా ఇవ్వడం ద్వారా ఆ వర్గ ఓటర్లను తమవైపు లాక్కునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. 

మొత్తమ్మీద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారా వచ్చే ఎన్నికలకు కూడా వ్యూహరచన చేస్తోంది బీజేపీ(BJP Plan). విపక్షాల ఇండియా కూటమి ప్రస్తుతం అటకెక్కే  పరిస్థితికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ సొంత బలం కంటే.. కూటమి కట్టడం పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే, కూటమి కప్పల తక్కెడలా మారింది. కాంగ్రెస్ బలహీనత కూడా అదే అనేది పచ్చి నిజం. ఎప్పుడైతే ఒంటరిగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్ మానేసిందో.. అప్పటి నుంచే విజయాలవైపు కాంగ్రెస్ ప్రయాణం తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చినా.. ఉత్తరాదిన మాత్రం కాంగ్రెస్ జెండా గట్టిగా ఎగిరే ఛాన్స్ ఇవ్వకూడని బీజేపీ గట్టి సంకల్పం పెట్టుకుంది. ఆ దిశలోనే పావులు కదుపుతోంది. కులాల వారీగా.. వర్గాల వారీగా ఎక్కడికక్కడ ఆధిక్యాన్ని సాధించే దిశలో బీజేపీ ముందుకు సాగిపోతోంది. అయితే, ఇక్కడ ఒక లెక్క మర్చిపోకూడదు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తాయని పూర్తిగా భావించలేం. అలాగే, ఇప్పుడు పగ్గాలు చేపట్టిన రాష్ట్రాల్లో పాలన కూడా బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం కచ్చితంగా ఉంటుంది. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు