ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఇంకా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ఇక ఈనెల 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా.. ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
Also Read: APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట
ఈ క్రమంలోనే ఈనెల 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. అయితే త్వరలోనే వైకుఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు.. తాజాగా కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
Also Read: Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darshan) ఈ నెల 19వ తేదీన ముగియనున్న నేపథ్యంలో భక్తులకు సర్వదర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులతో కలిసి టీటీడీ ఈవో జె.శ్యామలరావు గురువారం మీటింగ్ నిర్వహించారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం స్లాటెడ్ సర్వదర్శనం-ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ ప్రక్రియ శుక్రవారం ముగిసే అవకాశం ఉందని ఈవో జె.శ్యామలరావు చెప్పారు.
అయితే వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన తర్వాత ఈనెల 20వ తేదీన శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఈవో వివరించారు.ఈనెల 20వ తేదీన సర్వదర్శనం చేసుకోవాలని భావించే భక్తుల కోసం 19వ తేదీన తిరుపతిలో సాధారణ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయరని వివరించారు. భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించి.. శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు..
భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇక 19వ తేదీన ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లను కూడా జారీ చేయడం లేదని వెల్లడించారు. ఈనెల 20వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొటోకాల్ భక్తులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వివరించారు. ఈ కారణంగానే 19వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించడం లేదని ఈవో శ్యామలరావు తెలిపారు.
Also Read: Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!