/rtv/media/media_files/2025/01/08/AOkwrFCReOwiIxjqzybM.jpg)
TIrumala
తిరుమల స్వామివారిని దర్శించుకునే విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీచేసే దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్‌లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం కలగనుంది.
Also Read:TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక, మానసిక వైకల్యం.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కొవిడ్ ముందు వరకు రోజుకు 1,400 మందికి దర్శనం చేయించేది. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటల స్లాటుకు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటలకు 700 మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇస్తుండేవారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గాక 2021 ఏప్రిల్ 9 నుంచి పునరుద్ధరించింది. అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండడంతో కొవిడ్ సమయంలో గుంపులుగా ఉండటం సరికాదనే కారణంతో కరెంట్ బుకింగ్‌ను అప్పట్లో రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఉదయం 10 గంటల స్లాట్‌ను రద్దు చేసి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు మాత్రమే వెయ్యి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లే ధైర్యం చేయలేక తిరిగి వెళ్లిపోతున్నారు. పలుమార్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సందర్భాలూ ఉన్నాయి.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనుంది. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 5.30 గంటలకు కేటాయించేవారు. అయితే రాత్రివేళల్లో కంపార్టుమెంట్లలో వేచిఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్‌ను ఉదయం 10.30 గంటలకు మార్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఉదయం కల్యాణోత్సవం, ఉదయం టైంస్లాట్‌లు కలిగిన రూ.300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ కారణాలతో వీఐపీ బ్రేక్‌ను తిరిగి పూర్వపుపద్ధతిలో తెల్లవారుజామున 5.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే బోర్డు ఆదేశం మేరకు టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా రానున్న శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయానికి మార్చి ట్రయల్‌రన్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
Also Read: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ttd | tirumala | senior-citizen | good news for senior citizens | latest-news | latest-telugu-news | latest telugu news updates | telugu-news