Crime News : సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్‌... పోలీసుల ఫైరింగ్‌

తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు మహిళల నుంచి దొంగలు బంగారు ఆభరణాలను లాక్కుని రైలు ఆపి పారిపోతుండగా రైల్వే పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది.

New Update
Train Theft

Theft by thieves on Sarkar Express

Crime News : బాపట్ల పరిసర ప్రాంతాల్లో రైళ్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస చోరీలు, పోలీసుల కాల్పుల ఉదంతం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటాక (సుమారు 1.15 గంటల సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా, ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి దుండగులు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితులు, ఇతర ప్రయాణికులు అప్రమత్తమై చైన్‌ లాగడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.

రైలు ఆగడంతో దొంగలు కిందికి దూకి, సమీపంలోని పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైలులోనే ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి, పారిపోతున్న దుండగులపై 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేయడంతో, ప్రస్తుతం అప్పికట్ల - బత్తిపూడి పరిసర పొలాల్లో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు నెలల్లో మూడు పెద్ద ఘటనలు: ఆందోళనలో ప్రయాణికులు

కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే, గత రెండు నెలల వ్యవధిలో ఇలాంటి వరుస చోరీలు జరగడం రైల్వే భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.  ఏప్రిల్‌ 19, 2026: అప్పికట్ల సమీపంలో బెంగళూరు - నర్సాపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగలు 130 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.మూడు వారాల క్రితం బాపట్లకు సరిహద్దులో ఉన్న గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో దొంగలు ఏకంగా రైల్వే సిగ్నల్స్‌ను టాంపరింగ్‌ చేసి రైలును ఆపి, చోరీకి ప్రయత్నించారు. ఆ సమయంలోనూ రైల్వే పోలీసులు అప్రమత్తమై దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ, దుండగులు తప్పించుకున్నారు. జూన్ 14 అర్ధరాత్రి (ఆదివారం) సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో 7 సవర్ల బంగారం దొంగతనం, పోలీసుల 9 రౌండ్ల కాల్పులు.

గమనిక: ఒకే ప్రాంతంలో, ఒకే తరహా వ్యూహంతో (రైళ్లను ఆపడం, మహిళల నగలను టార్గెట్ చేయడం) వరుసగా మూడు సార్లు దొంగలు రెచ్చిపోవడం గమనార్హం. పోలీసులు కాల్పులు జరుపుతున్నప్పటికీ దుండగులు దొరకకపోవడం స్థానికం గా కలకలం రేపుతోంది. ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు రైల్వే, లోకల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు.

Advertisment
తాజా కథనాలు