/rtv/media/media_files/2026/06/01/south-coast-railway-zone-2026-06-01-07-25-19.jpg)
South Coast Railway Zone
South Coast Railway Zone : ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన 'దక్షిణ కోస్తా రైల్వేజోన్' జూన్ 1 నుంచి అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక మైలురాయి ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా, పారిశ్రామికంగా, ఆర్థికంగా ప్రాంతీయ అభివృద్ధికి ఒక కొత్త బాటలు వేయనుంది. ఈ ప్రతిష్టాత్మక రైల్వే జోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పుతీరంలో కోల్‌కతా, చెన్నై వంటి నగరాల మధ్య కీలక వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే రైల్వే శాఖలోని అంతర్గత సమీకరణాలు, వివిధ కారణాల వల్ల ఈ జోన్ ఏర్పాటు ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చింది.ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ వచ్చినప్పుడు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మునుపటి ప్రభుత్వం భూముల కేటాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే చంద్రబాబు నాయుడి సారథ్యంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముడసర్లోవ ప్రాంతంలో జోన్ ప్రధాన కార్యాలయానికి అవసరమైన భూమిని కేటాయించి అప్పగించడంతో జోన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
గత ఏడాది జనవరిలోనే ప్రధాని మోదీ ఈ జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. నగరంలోని వీఎంఆర్‌డీఏకు చెందిన 'ది డెక్' భవనంలో తాత్కాలికంగా రెండంతస్తులను కేటాయించింది. జోన్‌కు కేటాయించిన జనరల్ మేనేజర్ (GM), ఉన్నతాధికారులు,సిబ్బంది ఇప్పటికే విశాఖ చేరుకుని విధుల్లో చేరారు. నూతనంగా ఆవిర్భవించిన ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు, ఇప్పటివరకు తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి కొత్తగా ఏర్పాటు చేసిన 'విశాఖపట్నం డివిజన్'ను కలిపారు. ఈ మొత్తం డివిజన్ల కలయికతో కొత్త జోన్ దేశంలోనే అత్యంత కీలకమైన రైల్వే జోన్‌లలో ఒకటిగా అవతరించింది.
నూతన జోన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించారు. ఒక భాగాన్ని 'రాయగడ డివిజన్' (696 కి.మీ) పేరుతో కొత్తగా ఏర్పాటు చేసి ఒడిశా వైపు ఉన్న తూర్పు కోస్తా జోన్‌లోనే ఉంచారు. మిగిలిన 463 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లతో 'విశాఖపట్నం డివిజన్'ను ఏర్పాటు చేసి కొత్త జోన్ పరిధిలోకి తెచ్చారు. ఇందులో ఇచ్ఛాపురం-పలాస-విశాఖపట్నం-దువ్వాడ సెక్షన్ (270 కి.మీ), విజయనగరం-కూనేరు (102 కి.మీ) లాంటి కీలక సెక్షన్లు ఉన్నాయి.కొత్త జోన్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. గుంతకల్ డివిజన్ నుంచి రాయచూర్-వాడి (108 కి.మీ), గుంటూరు డివిజన్ నుంచి విష్ణుపురం-పగిడిపల్లి-జాన్‌పహాడ్ (142 కి.మీ) సెక్షన్లను తొలగించి సికింద్రాబాద్ డివిజన్‌లో కలిపారు. అలాగే సికింద్రాబాద్ డివిజన్‌లోని కొండపల్లి-మోటమర్రి (46 కి.మీ) సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు బదిలీ చేశారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ఈ నూతన జోన్ రాష్ట్ర రవాణా రంగాన్ని సమూలంగా మార్చేస్తుందని, రాష్ట్రాన్ని దేశంలోనే ఒక పెద్ద లాజిస్టిక్ హబ్‌గా మార్చడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ రైల్వే జోన్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల చిరకాల ఆకాంక్షను , విభజన హామీని నెరవేర్చినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Follow Us