Andhra Pradesh: మహిళలకు అన్యాయం చేశారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌, ఇతర విపక్ష పార్టీలను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
CM Chandra babu naidu

CM Chandra babu naidu

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌, ఇతర విపక్ష పార్టీలను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంతో జాతికి ద్రోహం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్ష పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయన్నారు. '' భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, సుదీర్ఘ కల సాకారం అవుతుందని అందరం భావించాం. 

 పార్లమెంట్, అసెంబ్లీలోనూ 33 శాతం మంది మహిళల్ని ప్రజాప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాం. మహిళల్ని గౌరవించటం భారత సంస్కృతిలో భాగం. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని మన నానుడి. నిన్న పార్లమెంటులో దానికి భిన్నంగా జరిగింది. అందుకు నిరసనగా నిడుదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాం.  మహిళలంతా బయటకు వచ్చి నిరసన తెలిజేయాలని పిలుపునిస్తున్నాను. 

 దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోంమంత్రి హామీ ఇచ్చారు. 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఏపీలో కూడా 50 శాతం మేర సీట్లు పెరిగేవి. కానీ విపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయి. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం. దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరం. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా?. నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికీ తీసుకెళ్తాం. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమే. దీనిపై పవన్ కల్యాణ్ గారితో మాట్లాడాను. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి.

Also Read: ప్రస్తత సీట్ల ప్రకారమే 2029లో ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు కష్టమే

 మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకుంటాయా?. 2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిల్లు కూడా తీసుకు రాలేకపోయారు. 2023లో బిల్లు ప్రవేశపెట్టినా దీనిని అమలు చేసే నిబంధన పెట్టారు. 2029లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే సవరణ బిల్లు తీసుకువచ్చారు.  కావాలనే కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ ఈ బిల్లుకు 2/3 మంది సభ్యుల మద్దతు రాకుండా అడ్డుకున్నాయి. దక్షిణాదికి, ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఏవేవో ఆరోపణలు చేసి సాకులు చెప్పారు. 

 ప్రజలు ఎన్నుకుంటేనే చట్టసభల్లోకి వచ్చిన వారు మహిళలకు ద్రోహం చేయటం సరికాదు. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు ఏ రంగంలో అయినా సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు వచ్చింది. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారు. ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలి. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతీ ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని'' చంద్రబాబు పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు