/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-06-57-50.jpg)
ap ssc 2026 results
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన సుమారు 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు గురువారం (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(IT Minister Nara Lokesh) స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటిస్తూ విద్యార్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు విడుదలైన వెంటనే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ల ద్వారా మార్కుల జాబితాలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
ఫలితాల వెల్లడి కోసం ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in ద్వారా ఫలితాలను పొందవచ్చు. ఇవే కాకుండా www.eenadu.net, www.eenadupratibha.net, లేదా www.manabadi.co.in వంటి పోర్టల్స్‌లో కూడా మార్కులు అందుబాటులో ఉంటాయి. ఫలితాల సమయంలో వెబ్‌సైట్లపై రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయంగా 'మనమిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009, లీప్ (LEAP) యాప్, డిజిలాకర్ (DigiLocker) ద్వారా కూడా విద్యార్థులు తమ గ్రేడ్లను సులభంగా తెలుసుకోవచ్చు. - 10th class results today
Also Read : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.... వివాహితపై అత్యాచారం
Andhra Pradesh 10th Results 2026
ఈ ఏడాది మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. మార్కుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు తొలిసారిగా 'ట్యాబ్' (Tablet) విధానాన్ని ప్రవేశపెట్టారు. సమాధాన పత్రాల మూల్యాంకనం (Valuation) పూర్తయిన వెంటనే, మార్కులను పేపర్ రికార్డులతో పాటు ట్యాబ్‌లలో కూడా అప్లోడ్ చేయడం ద్వారా ఫలితాల ప్రక్రియను వేగవంతంతో పాటు పారదర్శకం చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే అన్ని సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసింది.
వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకునే విద్యార్థులు మొదట bse.ap.gov.in లోకి వెళ్లి, హోమ్ పేజీలో కనిపించే "AP SSC Results 2026"(ap ssc 2026 results) లింక్‌ను క్లిక్ చేయాలి. అక్కడ తమ రోల్ నంబర్ (Roll Number) ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మార్కుల వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు తమ మార్కుల జాబితాను ప్రింట్ తీసుకోవడం లేదా పిడిఎఫ్ (PDF) రూపంలో సేవ్ చేసుకోవడం మంచిది. వాట్సాప్ ద్వారా ఫలితాలు కావాలనుకునే వారు నిర్ణీత నంబర్‌కు హాల్ టికెట్ నంబర్ సందేశం పంపితే సరిపోతుంది.
మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు భరోసా ఇస్తూ.. పరీక్షల్లో ఆశించిన లక్ష్యాలను చేరుకున్న వారు అభినందనీయులని, ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోయినా నిరుత్సాహపడకూడదని హితవు పలికారు. పదో తరగతి కేవలం ఒక మైలురాయి మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. మార్చిలో జరిగిన ఈ పబ్లిక్ పరీక్షల ఫలితాల అనంతరం రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.
Also Read : వైట్ హౌజ్ సమీపంలో కాల్పులు... ఆ సమయంలో అదే హోటల్‌లో కేఏ పాల్
Follow Us