Katchatheevu : అసలేంటీ కచ్చతీవు...దాని గురించి గొడవ ఎందుకు అవుతోంది?

లోక్‌సభ ఎన్నికల ముందు కచ్చ ద్వీపం వివాదం చెలరేగుతోంది. ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసి..భారతదేశాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీని మీద కాంగ్రెస్‌ కూడా ధీటుగానే స్పందిస్తోంది. ఇంతకీ అసలేంటీ కచ్చతీవు..ఎందుకు దీని గురించి గొడవ అవుతోంది.

New Update
Katchatheevu : అసలేంటీ కచ్చతీవు...దాని గురించి గొడవ ఎందుకు అవుతోంది?

Katchatheevu Island: కచ్చతీవు ద్వీపం అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఐలాండ్‌ గురించి ఆర్టీఐ ఇచ్చిన రిప్లైనే దీనికి కారణం.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కచ్చతీవు గురించి ఆర్టీఐ దాఖలు చేశారు. దానికి ప్రతిస్పందనగా ఆర్టీఐ చెప్పిన విషయం రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi), శ్రీలంక అధ్యక్షుడు బండారునాయకే ఒప్పందం చేసుకున్నారని ఆర్టీఐ చెబుతోంది. దీని కింద కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అధికారికంగా అప్పగించారు. ఈ సమాచారం బయటకు రావడంతో బీజేపీ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి విదేశాంగ మంత్రి వరకు ఈ అంశాన్ని లేవనెత్తారు. భారతదేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను నిర్వీర్యం చేయడమే 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న పని అంటూ మోదీ (PM Modi) కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

క‌చ్చతీవుపై ప్రధాని మోదీ ఏం చెప్పారు?

1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై మోదీ మరోసారి కాంగ్రెస్ (Congress), డీఎంకేలను (DMK) టార్గెట్ చేశారు. డీఎంకే, కాంగ్రెస్‌లను ఒకే కుటుంబమని ధ్వజమెత్తారు. కచ్చతీవు ద్వీపంలో వెలువడుతున్న విషయాలు డీఎంకే ద్వంద్వ ప్రమాణాలను పూర్తిగా బయటపెట్టాయన్నారు మోదీ. కాంగ్రెస్, డీఎంకేలు వారి కొడుకులు, కుమార్తెల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని చురకలంటించారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో శ్రీలంకకు ఈ ఐలాండ్‌ను ఇచ్చారు. ఇదీ కాంగ్రెస్‌ చరిత్ర. భారతమాతను విచ్ఛిన్నం చేసిన చరిత్ర...అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ద్వీపం ఎక్కడ ఉంది?

కచ్చతీవు అనేది పాక్ జలసంధిలోని ఒక చిన్న ద్వీపం. ఇది బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. 285 ఎకరాల పచ్చని ప్రాంతం 1976 వరకు భారతదేశానికి చెందినది. అయితే శ్రీలంక- భారత్‌ మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉండేది. దానిపై శ్రీలంక (Sri Lanka) నేడు హక్కులను క్లెయిమ్ చేస్తోంది. నిజానికి 1974లో.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1974-76 మధ్యకాలంలో శ్రీలంక అధ్యక్షుడు బండారునాయకేతో నాలుగు సముద్ర సరిహద్దు ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు.

కచ్చతీవు ద్వీపం చరిత్ర ఏమిటి?

14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా కచ్చ ద్వీపం (Katchatheevu Island) ఏర్పడింది. ఇది ఒకప్పుడు 17వ శతాబ్దంలో మధురై రాజు రామనాథ్ ఆధ్వర్యంలో ఉండేది. బ్రిటిష్ పాలనలో ఈ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీ కిందకు వచ్చింది. 1921లో శ్రీలంక -భారత్‌ రెండూ చేపల వేట కోసం భూమిని క్లెయిమ్ చేశాయి. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది భారత్‌లో భాగంగా పరిగణించారు.

ప్రాముఖ్యత ఏమిటి?

1974లో ఈ ద్వీపానికి సంబంధించి ఇరు దేశాల మధ్య జూన్ 26న కొలంబోలో, జూన్ 28న ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఈ రెండు సమావేశాల్లో కొన్ని షరతులతో ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు. భారతీయ మత్స్యకారులు తమ వలలను ఆరబెట్టడానికి ఈ ద్వీపాన్ని ఉపయోగించుకోవచ్చు. వీసా లేకుండా ద్వీపంలో నిర్మించిన చర్చిని సందర్శించడానికి భారత్‌ ప్రజలకు అనుమతి ఉంది. అయితే ఈ ఒప్పందాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ ద్వీపానికి సంబంధించిన వివాదం ఏమిటి?

తమిళనాడులోని అన్ని ప్రభుత్వాలు 1974 ఒప్పందాన్ని అంగీకరించడానికి నిరాకరించాయి. శ్రీలంక నుంచి ద్వీపాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. 1991లో తమిళనాడు అసెంబ్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి, ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసింది. 2008లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కచ్చతీవు ఒప్పందాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కచ్చతీవును శ్రీలంకకు బహుమతిగా ఇచ్చిన రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు . ఇది కాకుండా 2011లో జయలలిత మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేశారు. మే 2022లో తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, PM మోదీ సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో, కచ్చతీవు ద్వీపాన్ని భారతదేశానికి తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సాంప్రదాయ తమిళ మత్స్యకారుల చేపల వేట హక్కులు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ విషయంపై తమిళనాటు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ద్వీపాన్ని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారన్న ఆర్టీఐ సమాధానాన్ని బీజేపీ ప్రచారాల్లో వాడుకుంటోంది.

Also Read:National: జయ్‌శంకర్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం..రాజకీయ రంగులు అద్దుకుంటున్న కచ్చతీవు అంశం

Advertisment
Advertisment
తాజా కథనాలు