Vizag Steel Plant: విశాఖలో ఉక్కు వార్ అసలు నిజమేంటి? ప్రైవేటీకరణ టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయా?

ఏపీలో మరోసారి స్టీల్‌ ప్లాంట్‌పై రచ్చ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయని పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. అసలు నిజలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Vizag Steel Plant: విశాఖలో ఉక్కు వార్ అసలు నిజమేంటి? ప్రైవేటీకరణ టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయా?

Vizag Steel Plant: అది 1966.. ఆంగ్లో - అమెరికన్ కన్సార్టియం సిఫార్సు చేసినప్పటికీ వైజాగ్‌లో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయకూడదని నాటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) నిర్ణయించారు. ఈ నిర్ణయం తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేతకు కారణమైంది. స్వాతంత్య్ర సమరయోధులు టి.అమృతరావు, తెన్నేటి విశ్వనాధం నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, సామాన్యులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పోలీసు కాల్పుల్లో మైనర్‌లతో సహా 12 మంది నిరాయుధులు మరణించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ డిమాండ్‌కు మద్దతుగా 66 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. దీంతో ఇందిరా దిగి వచ్చారు.. 1970లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి తీరప్రాంత ఉక్కు కర్మాగారం.

 ప్రైవేటీకరణకు టీడీపీ-జనసేన మద్దతు..
సీన్‌ కట్‌ చేస్తే.. ఏపీలో మరోసారి స్టీల్‌ ప్లాంట్‌పై రచ్చ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయని పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. నిజానికి 2021లోనే వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న వైసీపీతో పాటు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గట్టిగా వ్యతిరేకించాయి. ఇక 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ ప్రైవేటీకరణ ఆగుతుందన్న చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి టీడీపీ అతిపెద్ద మిత్రపక్షం.

శ్రీనివాసవర్మ కామెంట్స్‌పై ఏపీ నాట తీవ్ర చర్చ..
మరోవైపు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి HD కుమారస్వామి విశాఖకు వచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ పని తీరుతో పాటు ఆర్థిక పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. ఇక ఇటవలి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేసిన కామెంట్స్‌పై ఏపీ నాట తీవ్ర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పాలసీనే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు వర్తిస్తుందని శ్రీనివాసవర్మ చెప్పారు. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ రూ. 2,859 కోట్ల నష్టాన్ని చవిచూసిందన్నారు. ఏటా కంపెనీకి భారీ నష్టాలను వస్తున్నాయని.. అందుకే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు.

ప్రజలకు ఒక ఎమోషన్..
వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడి ప్రజలకు ఒక ఎమోషన్. అందుకే స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం తమ మనోభావాలను దెబ్బతీస్తుందని విశాఖ ప్రజలు చెబుతుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధిని అందించే సంస్థ ఇది. అయితే చాలా ఏళ్లుగా సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్రం అంటోంది. నిజానికి గతంలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భారీ నష్టాలను చవిచూసింది. 2000లో నాటి వాజ్‌పెయి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని ముందుగా ఆలోచించింది. అయితే తర్వాత నిర్ణయం మార్చుకుంది. రుణాలను ఈక్విటీగా మార్చాలని నాడు వాజ్‌పెయి సూచించారు. వడ్డీ రేటు తగ్గింపు, జరిమానా వడ్డీల మాఫీ, షెడ్యూల్ చేసిన ప్రిన్సిపల్ మొత్తాలను ముందస్తుగా చెల్లించడం లాంటివి చేసిన నాటి వాచ్‌పెయి ప్రభుత్వం నాడు నష్టాలను పూడ్చగలిగింది.

టీడీపీ ఎంపీ రామ్‌మోహన్ నాయుడు ఏమన్నారంటే..
అటు క్యాప్టివ్ మైన్స్ లేని ఏకైక ఉక్కు తయారీ PSU వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందుకే దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్‌ల కంటే ముడి పదార్థాలపై చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. క్యాప్టివ్ గనులు కలిగిన సంస్థలు ఇనుప ఖనిజం కోసం టన్నుకు రూ. 1,500 వెచ్చిస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ రూ. 7,000 ఖర్చు చేస్తోంది. అటు అధిక సరుకు రవాణా ఖర్చులు, పారిశ్రామిక విద్యుత్ సుంకాలు లాంటివి నష్టాలకు కారణంగా కేంద్రం చెబుతోంది. అయితే పెట్టుబడుల ఉపసంహరణ లేదా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటికరణ ఈ మార్కెట్ పరిస్థితులను మార్చదని 2021లో ఓ వెబ్‌సైట్‌కు రాసిన ఆర్టికల్‌లో టీడీపీ ఎంపీ రామ్‌మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.

మరోవైపు స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు, CITU వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇంకోవైపు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగడం ఏనాడో ఫిక్స్‌ అయ్యిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంలో టీడీపీ ఎలాంటి యూ-టర్న్‌ తీసుకోలేదని నారాలోకేశ్‌ అంటున్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మాటగా కనిపిస్తోంది. ఏది నిజమో.. ఎవరి మాట నిజమోనన్న గందరగోళంలో ఏపీ ప్రజలు ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు