వామ్మో.. ఆ దేశంలో ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్షలు

ఇరాన్‌లో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 419 మందికి మరణశిక్ష విధించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భారీ స్థాయిలో మరణ శిక్షలను అమలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఐరాస.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి విచారణ జరగలేదని తమకు తెలిసినట్లు పేర్కొంది.

New Update
వామ్మో.. ఆ దేశంలో ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్షలు

చాలాదేశాలు తీవ్రమైన నేరాలు చేసినవారికి ఉరిశిక్షలు అమలు చేస్తుంటాయి. ఇప్పటికే ఈ శిక్షణలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌లో ఈ మరణ శిక్షలు ఎక్కువగా అమలవుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే మొత్తం 419 మందికి మరణశిక్ష విధించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గత ఏడాదితో పోల్చి చూస్తే.. దాదాపు 30 శాతం ఈ మరణశిక్షలు పెరిగాయని పేర్కొంది. గత నాలుగేళ్లలో చూసుకుంటే అక్కడ ప్రతీ సంవత్సరం అమలవుతున్న మరణశిక్షల్లో దాదాపు 25 శాతం పెరుగుదల నమోదవుతోంది.

ఇరాన్‌ని మానవహక్కుల పరిస్థితులకు సంబంధించి ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ తాజా నివేదికను సభ ముందు పెట్టారు. ఇరాన్‌లో ఈ ఏడాది మొదటి 7 నెలల్లో 419 మందికి మరణశిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఏడుగురు హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు సంబంధించిన వారే ఉన్నారని తెలిపారు. అలాగే 239 మంది మాదక ద్రవ్యాల ఆరోపణలను ఎదుర్కొంటున్నవారున్నారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే మాదక ద్రవ్యాల కేసులు ఏకంగా 98 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

అయితే ఇలా భారీ స్థాయిలో మరణ శిక్షలను అమలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన గుటెరస్‌.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి దర్యాప్తు జరగలేదనే విషయం తెలిసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు జరిగిన సమయంలో కూడా నమోదైన కేసుల విచారణల్లో పారదర్శకత, స్వతంత్ర దర్యాప్తులు జరగలేదని తెలిపారు. అయితే ఈ నిరసనలు జరిగిన సమయంలో దాదాపు 20వేల మంది సామాన్యులను అరెస్టు చేసి నిర్బంధించినట్లు తమకు తెలిసిందని పేర్కొన్నారు. అయితే ఇలా అరెస్టైన వాళ్లలో ఎక్కువగా 15 ఏళ్ల వయసు వారే ఉండటం ఆందోళనకరమని అన్నారు. ముఖ్యంగా మహిళలు, జర్నలిస్టులు, న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేసినట్లు చెప్పారు. అలాగే జాతీయ భద్రత పేరుతో ఈ మరణశిక్షలను ఇరాన్‌ సమర్థించుకోవడం శోచనీయమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు