Vanajeevi ఎక్కడికెళ్లినా మొక్కలే.. పిల్లలకు చెట్లపేర్లే: వనజీవి చరిత్ర తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు!

కాలుష్యం కోరల్లో కొట్టుమిట్టాడుతున్న జీవరాశికి ఈ వృద్ధుడు స్వచ్ఛమైన ఊపిరి అందించాడు. బతికినంతకాలం తన జీవితాన్ని ప్రకృతికే అంకితం చేశాడు. కోటికి పైగా మొక్కలు నాటి అరుదైన మనిషిగా చరిత్ర సృష్టించిన వనజీవి రామయ్య ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

New Update
vanajeevi

Vanajeevi Ramaiah

Vanajeevi Ramaiah: ఈ భూమిమీద ఉన్న జీవరాశికి మొక్కలే ఆధారం. ఈ నేలమీద చెట్లు లేకపోతే ఏ ప్రాణి నిలవలేదు. అలాంటిది సైన్స్ చదువుకుంటున్న మనుషులు అభివృద్ధిపేరిట మహా వృక్షాలను కూకటివేళ్లతో కూల్చివేస్తున్న తరుణంలో ఓ వృద్ధుడు నవయవ్వన ఆలోచనలతో  ముందుకొచ్చాడు. కాలుష్యం కోరల్లో కొట్టుమిట్టాడుతున్న జీవరాశికి స్వచ్ఛమైన ఊపరి అందించాలనుకున్నాడు. ఈ తరుణంలో తన జీవితమే ప్రకృతికి అంకితం చేశాడు. జీవితాంతం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం అంకితమయ్యాడు. కనిపించిన ఖాళీ ప్రదేశంలో కోటికి పైగా మొక్కలు నాటి మానవ జాతిలోనే అరుదైన మనిషిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు తనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి కూడా మొక్కలు నాటడమే శిక్షగా విధించిన ఆయన జీవిత కథ పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠశాల పాఠ్యాంశాల్లోనూ చేర్చారు. అతనే మన తెలంగాణ నవమానవుడు వనజీవి రామయ్య. 

కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ..

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య 1937 జూలై 1న లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించాడు. అతని అసలు పేరు దరిపల్లి రామయ్య. పుట్టి పెరిగింది ముత్తగూడెం గ్రామం కాగా తన భూములు రెడ్డిపల్లిలో ఉండటంతో అక్కడే స్థిరపడ్డారు. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూనే మరోవైపు మొక్కల పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని కృషి చేశాడు. కోట్ల మొక్కలు నాటడమే జీవిత ఆశయంగా మలుచుకున్న ఆయనకు ‘వనజీవి’ ఇంటిపేరుగా మారిపోయింది. 

చినుకులు పడగానే అడవుల బాట..

రామయ్య నిత్యం అడవుల వెంట తిరుగి వివిధ రకాల విత్తనాలను సేకరించేవాడు. తొలకరి చినుకులు పడటమే ఆలస్యం అడవుల్లో విత్తనాలు చల్లేవాడు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టలు, జాతరలు జరిగే ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో గింజలు చల్లడమే ఆయన ప్రధానం లక్ష్యం. చిన్న మట్టి కుండలు, ప్లాస్టిక్ డబ్బాలు, రింగుల్లోనూ మొక్కల పెంపకాన్ని ప్రొత్సహిస్తూ ప్రచారం మొదలుపెట్టాడు.  తిరుమల కొండపై తన ప్రచార సాధనాలు చెట్లకు తగిలించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనకు ఉన్న నలుగురు మనుమరాళ్ల పేర్లు కూడా చెట్లపేర్లే పెట్టుకున్నాడు. 1 చందనపుష్ప, 2 హరిత లావణ్య, 3 కబంధపుష్ప, 4 వనశ్రీ.

మొక్కలు నాటడమే శిక్ష.. 

2022లో రామయ్యకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం రెడ్డిపల్లి గ్రామంలో ఉదయం మొక్కలకు నీరు పోయడానికి బండిపై వెళ్తుండగా ఓ డీసీఎం ఢీకొట్టింది. రామయ్య కాలు, తలకు గాయాలయ్యాయి. అయితే తనకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌కు పోలీస్ స్టేషన్‌లో కేసు వద్దని అరుదైన శిక్ష విధించారు. శిక్షగా వ్యాన్ డ్రైవర్ చే 100 మొక్కలు నాటించి సంరక్షించాల్సిన బాధ్యత అప్పగించడం తనకు మొక్కలమీదున్న ప్రేమను మరోసారి చాటిచెప్పింది. అంతేకాదు తాను ఏ శుభకార్యానికి వెళ్లినా మొక్కలను బహుమతిగా అందించేవాడు. 

పాఠ్యాంశంగా రామయ్య జీవితం..
రామయ్య చేసిన సామాజిక సేవను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం అతని జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా ప్రస్తుతం బోధిస్తుండగా.. తెలంగాణ  ప్రభుత్వం సైతం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా చేర్చాడం గమనార్హం. 

కేంద్ర ప్రభుత్వం అవార్డులు.. 
కోటిగాపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ వనజీవికి 2017లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 2005లో సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డుతో గౌవరవించింది. ‘యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌’  అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి ‘వనసేవా’ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య.
2000 సంవత్సరంలో సీఎం చంద్రబాబు వనజీవి రామయ్య సేవలను గుర్తించి ఒక మోపెడ్ ను కొనిచ్చారు. ప్రతి నెలా రూ.1500  గౌరవ భత్యాన్ని కేటాయించారు.

రామయ్య మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు. రామయ్య మృతికి సంతాపం తెలుపుతూ సీఎంవో నుంచి ప్రకటన విడుదల చేశారు. వనజీవి రామయ్య గారి మరణం పచ్చదనానికి తీరని లోటు అన్నారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

trees | nature | telugu-news | today telugu news

 

#today telugu news #telugu-news #Vanajeevi Ramaiah #nature #trees
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు