/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-53-32.jpg)
Grain damaged by untimely rain
Untimely rains : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా విరుచుకుపడిన అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల బీభత్సం అన్నదాతలను నిలువునా ముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి, మొక్కజొన్న, జొన్న ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా వర్షార్పణమైంది. లారీల కొరత, గన్నీ సంచుల లేమి, అధికారుల నిర్లక్ష్యంతో నెలరోజులకు పైగా కళ్లాల్లోనే పడిగాపులు కాస్తున్న రైతుల గుండెలు అకాల వానతో పగిలాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే నీటిపాలు కావడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతాంగం కన్నీటిపర్యంతమవుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా అకాల వర్షాల ప్రభావం, రైతుల ఆందోళనల సమగ్ర కథనం ఇదీ...
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో అత్యధికంగా 12.3 { సెం.మీ.}మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్‌లో 6.5 { సెం.మీ.} వర్షపాతం నమోదైంది. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. గజ్వేల్‌లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు బోరుమన్నారు. మిరుదొడ్డి మండలం అందే గ్రామానికి చెందిన బయ్యారం కిష్టారెడ్డి (60) అనే రైతు వారం రోజులుగా ధాన్యం కుప్పల వద్దే కాపలా ఉంటూ, తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-54-20.jpg)
సంగారెడ్డిలో రైతుల ఆవేదన.. సిర్గాపూర్‌లో లాఠీచార్జీ
సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6.1{ సెం.మీ.} వర్షం కురవగా.. జిన్నారం, నర్సాపూర్ మండలాల్లోని కళ్లాల్లో వరి ధాన్యం నీటిపాలైంది. లారీలు రాక, గోనె సంచులు ఇవ్వకపోవడంతో తమ పంట నాశనమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు ఉరి శరణ్యమవుతోందని జిన్నారం రైతులు కోపోద్రిక్తులయ్యారు. చిలిపిచెడ్ మండలం చండూరు గ్రామస్తులు లారీల కొరతను నిరసిస్తూ మెదక్-సంగారెడ్డి రహదారిపై రాస్తారోకో చేశారు. తడిసిన ధాన్యానికి బస్తాకు 3 నుండి 4 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు మండిపడ్డారు. మరోవైపు, నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని సిర్గాపూర్ మండలం బొక్కస్‌గావ్‌లో పీఏసీఎస్ సొసైటీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో రెండు వర్గాల రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అనంతరం సబ్ కలెక్టర్ ఉమా హారతి ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో రైతుల రాస్తారోకో
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నెల రోజులుగా కొనుగోళ్లు జరగకపోవడంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు వరి, మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. హమాలీలు లేకపోవడం, అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు పెద్దపల్లిలో ఆందోళనకు దిగారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటను అమ్ముకోవడం ఇంత నరకంగా మారుతుందని ఊహించలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-54-50.jpg)
నల్గొండలో స్తంభించిన జాతీయ రహదారి.. దేవరకొండలో నష్టం
నల్గొండ జిల్లా చిట్యాలలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి చెట్లు, ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, చిట్యాల వద్ద జాతీయ రహదారి (NH-65) పైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుండ్లపల్లిలో 6.2{ సెం.మీ.} వర్షం నమోదు కాగా, దేవరకొండ నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-56-25.jpg)
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కొనుగోళ్లపై ఆగ్రహం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యపు రాశులపై నీరు నిలిచింది. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వడ్ల కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చందుర్తి-కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించడంతో రవాణా నిలిచిపోయింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, వెంకట్రావుపేట కేంద్రాల్లో తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగ్స్ లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు జరపకపోతే నిరాహార దీక్షకు దిగుతామని బీజేపీ శ్రేణులు హెచ్చరించాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-55-19.jpg)
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ప్రకృతి బీభత్సం
కామారెడ్డి జిల్లా దోమకొండ, సదాశివనగర్‌లలో 5 { సెం.మీ.} నిజామాబాద్ దర్పల్లిలో 5.4 { సెం.మీ.} వర్షపాతం నమోదైంది. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద, మద్నూర్ కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఎకరానికి కేవలం 10 క్వింటాళ్ల పరిమితి విధించడంపై రైతులు మండిపడుతున్నారు. మిగిలిన ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని, ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి-సిరిసిల్ల, మెదక్-బోధన్ ప్రధాన రహదారులపై రైతులు వడ్ల సంచులతో ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ వైఫల్యంపై హరీష్ రావు విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నదాతలకు ఈ గతి పట్టిందని విపక్షాలు మండిపడ్డాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో తడిసిన వడ్లను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం కేవలం 50 శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన సగం రోడ్లపైనే ఉండి తడిసిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు తరుగు లేకుండా కొనుగోళ్లు జరగడం లేదని, 'A' గ్రేడ్ వడ్లను కూడా 'B' గ్రేడ్ కింద మార్చి రైతులను ముంచుతున్నారని ఆరోపించారు. ఇసుక లారీలను సైతం ధాన్యం రవాణాకు ఉపయోగించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-55-36.jpg)
'రైతు గోస - బీజేపీ భరోసా' యాత్ర.. బండి సంజయ్ హెచ్చరికలు
కరీంనగర్ బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, గాలివానకు కూలిన ఇళ్లను పరిశీలించి తక్షణ సాయం ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లలో సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదని, కేంద్రం పైసలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని గుంజపడుగులో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు 'రైతు గోస - బీజేపీ భరోసా' యాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సభకు బస్సులు వస్తాయి కానీ, రైతుల ధాన్యం తరలించడానికి లారీలు రావా అని ఈటల ఎద్దేవా చేశారు. క్వింటాలుకు పైసా కోత లేకుండా చివరి గింజ వరకు కొనేవరకు తాము వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు చేస్తాం.. మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు
విపక్షాల ఆరోపణలపై కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే ధర్నాలు చేస్తూ, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈసారి పంట దిగుబడి భారీగా పెరిగిందని, జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందని, మొత్తం 1.70 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. లారీల కొరత తీర్చడానికి సింగరేణి సంస్థ లారీలను కూడా కోరడం జరిగిందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించేది లేదని, బాల్క సుమన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-56-58.jpg)
యుద్ధప్రాతిపదికన రంగంలోకి గంగుల.. వేగవంతమైన కొనుగోళ్లు
రైతుల సమస్యలపై స్పందించిన కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ నగునూరు, చేగుర్తి గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాలను స్వయంగా సందర్శించారు. అదనపు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. చేగుర్తిలో హమాలీలను మాట్లాడి, స్వయంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేయించి ధాన్యం తూకం వేయించి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేసి, తక్షణమే లారీలు, గన్నీ సంచులను సమకూర్చి అన్నదాతలను ఆదుకోవాలని రైతాంగం, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Follow Us