Unemployees : దిల్‌సుఖ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత..నిరుద్యోగుల మెరుపు ధర్నా

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ మరోసారి నిరుద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లింది. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వందలాది మంది అభ్యర్థులు అకస్మాత్తుగా ప్రధాన చౌరస్తాలోకి దూసుకొచ్చి మెరుపు ధర్నాకు దిగారు.

New Update
FotoJet (12)

UN Employees protest again in Dilsukhnagar.

Unemployees : హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ హబ్ అయిన దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar) మరోసారి నిరుద్యోగుల, పోలీస్ ఉద్యోగార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం వందలాది మంది అభ్యర్థులు అకస్మాత్తుగా దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన చౌరస్తాలోకి దూసుకొచ్చి మెరుపు ధర్నాకు దిగారు. డప్పు చప్పుళ్లతో, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరుబాట పట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కేవలం 5 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఉద్యోగార్థులు మండిపడ్డారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ కలిపి కనీసం 20 వేల పోస్టులతో మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి రూమ్‌లల్లో ఉంటూ, అప్పులు తెచ్చి మరీ కోచింగ్ తీసుకుంటున్న తమకు ఈ 5 వేల పోస్టులు ఏమాత్రం సరిపోవని, ఇది నిరుద్యోగులను నట్టేట ముంచడమేనని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగులు ఒక్కసారిగా దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మైళ్ల దూరంలో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దాడికి దిగారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుదలతో కూర్చున్న పలువురు నిరసనకారులను పోలీసులు బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లి, పోలీస్ వాహనాల్లో ఎక్కించి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంత స్టేషన్లకు తరలించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీల సంఖ్యను భారీగా పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

నిరుద్యోగుల ఈ ఆందోళన కేవలం దిల్‌సుఖ్‌నగర్‌కే పరిమితం కాలేదు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ (OU) లోనూ విద్యార్థులు, నిరుద్యోగ జేఏసీ నాయకులు భారీ ర్యాలీలు చేపట్టి, ధర్నాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు అశోక్‌ నగర్‌ లైబ్రరీ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు కూడా ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థి లోకం, నిరుద్యోగులు అంతా ఏకతాటిపైకి వస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచుతూ తక్షణమే సవరించిన ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల అరెస్టల నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు