/rtv/media/media_files/2026/02/03/fotojet-4-2026-02-03-20-24-01.jpg)
Typhoid terror in Telangana
Typhoid : టైఫాయిడ్ ఇపుడు తెలంగాణను వణికిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న టైఫాయిడ్ మరణాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రతీ ఐదుగురిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు ఉంటున్నారని ఒక నివేదిక వెల్లడించడం సంచలనంగా మారింది. 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 1,075 మంది టైఫాయిడ్ కారణంగా చనిపోతే అందులో 202 మరణాలు ఒక్క తెలంగాణలోనే నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో టైపాయిడ్ మరణాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. 2023లో టైఫాయిడ్ బారినపడి 202 మంది తెలంగాణ వారు చనిపోయినట్లు తెలిపింది. అంతేకాకుండా దేశంలోని అన్ని టైఫాయిడ్ మరణాల్లో 19 శాతం తెలంగాణ నుంచే ఉన్నట్లు ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. తోంది. కలుషితమైన ఆహారం, నీరు, పారిశుద్ధ్య సమస్యలు టైఫాయిడ్ వ్యాప్తికి ప్రధాన కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే టైఫాయిడ్ బారిన పడ్డ వారికి.. చికిత్సలో ఆలస్యం చేయడం వల్ల పేగులు దెబ్బతినడం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతున్నాయని తద్వారా వారు మరణిస్తున్నారని ఆ నివేదిక హెచ్చరించింది.
2023కు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ రిపోర్ట్ ప్రకారం.. మన దేశంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా మొత్తం 1,075 మరణాలు నమోదైనట్లు తేలింది. కాగా 202 మరణాలతో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక 377 మరణాలతో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అయితే దేశంలోని జనాభాలో తెలంగాణ జనాభా కేవలం 2.5 శాతం మాత్రమే కాగా.. టైఫాయిడ్ సంబంధిత మరణాల్లో మాత్రం 19 శాతం వాటాను కలిగి ఉండటం.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది. కాగా టైఫాయిడ్ మరణాల్లో మూడో స్థానంలో 118 మరణాలతో పంజాబ్.. 36 మరణాలతో ఢిల్లీ నాలుగో స్థానాల్లో నిలిచాయి.
టైఫాయిడ్ ఎందుకొస్తుందంటే?
సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందంటున్నారు. అపరిశుభ్రమైన నీరు.. పైపులైన్లు వేసేటపుడు, మరమ్మతుల సమయంలో అందులో మురుగునీరు కలియడం మూలంగా వాటిని తాగడం వల్ల ఈ టైఫాయిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని తెలుపుతున్నారు. శుభ్రత లేకుండా తయారు చేసే స్ట్రీట్ ఫుడ్, దాని తయారీలో ఉపయోగించే కలుషితమైన నీరు మూలంగా కూడా ఎక్కువగా ఈ టైఫాయిడ్ బారిన పడుతున్నారు. నగరాల్లో నాలాలు, రోడ్లపై మురుగునీరు పొర్లడం, మురికివాడల్లో వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఈ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా అతి వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా టైఫాయిడ్ సోకిన సమయంలో చాలామంది.. దాన్ని ఒక సాధారణ జ్వరం అని భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు సొంతంగా మెడిసిన్ వేసుకుని తగ్గించుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి నిర్ణయాల వల్లే వారి పరిస్థితి విషమించి ప్రాణాల మీదికి తెస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే.. ఈ టైఫాయిడ్ వల్ల పేగులకు రంధ్రాలు పడటం, రక్తంలో ఇన్ఫెక్షన్ రావడం, అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో సరైన మెడిసిన్ వాడకపోవడం, సాధారణ యాంటీబయాటిక్స్ పని చేయకపోవడం టైఫాయిడ్ రోగులకు మరో పెద్ద సవాలుగా మారిందని డాక్టర్లు అంటున్నారు.
దీని నివారణ కోసం నిపుణుల సూచించినట్లు.. నీటిని కాచి చల్లార్చి తాగడం.. వేడి వేడి ఆహారాన్ని తినడం, జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించి సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల మరణాలను అరికట్టవచ్చని చెబుతున్నారు. టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి అక్కడ పారిశుద్ధ్య చర్యలను పూర్తిగా చేపట్టాలని సూచిస్తున్నారు.
Follow Us