TG: పెను విషాదం.. బోరు బావిలో మనవడు.. ప్రాణ త్యాగం చేసి కాపాడిన తాత!

నల్గొండ జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో పడిపోయిన నాలుగేళ్ల మనవడిని కాపాడుకునేందుకు వెళ్లిన ఆ తాత ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సకాలంలో స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఇద్దరినీ బయటకు తీసినప్పటికీ..అప్పటికే ఊపిరి ఆడక తాత కన్నుమూశాడు.

New Update
FotoJet - 2026-05-16T114300.834

Boy falls into a borehole... Grandfather dies while guarding

Nalgonda district : నల్గొండ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో పడిపోయిన నాలుగేళ్ల మనవడిని కాపాడుకునేందుకు వెళ్లిన ఆ తాత.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సకాలంలో స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఇద్దరినీ బయటకు తీసినప్పటికీ.. అప్పటికే ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురైన తాత మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ శివారులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వెంకన్న (53) తన నాలుగేళ్ల మనవడితో కలిసి శనివారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు.పొలం వద్ద ఆడుకుంటున్న క్రమంలో, అక్కడ తెరిచి ఉన్న ఒక బోరుబావి గుంతను గమనించని నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. మనవడు బోరు గుంతలో పడిపోవడం చూసి తాత వెంకన్న తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. క్షణాల్లో ఏం చేయాలో తోచక, ఎలాగైనా కళ్ల ముందే ఉన్న మనవడిని ప్రాణాలతో కాపాడుకోవాలనే తాపత్రయంతో ఆయన కూడా ఆ బోరు గుంతలోకి దిగాడు. అయితే, ఆ గుంత ఇరుకుగా ఉండటంతో వెంకన్న సైతం అందులోనే ఇరుక్కుపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీలు, అవసరమైన పరికరాల సహాయంతో అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. బోరు గుంతలో ఇరుక్కుపోయిన తాత, మనవడిని సురక్షితంగా బయటకు తీశారు.బోరు గుంతలోంచి బయటకు తీసిన సమయానికి ఇద్దరికీ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఎక్కువ సమయం లోపల ఇరుక్కుపోవడం వల్ల వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

 పోలీసులు, స్థానికులు కలిసి ఇద్దరినీ చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే వెంకన్న పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. నాలుగేళ్ల బాలుడు ప్రస్తుతం ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్లముందే ఆడుకుంటూ బోరు గుంతలో పడ్డ మనవడి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి, స్థానిక ఉప సర్పంచ్ వెంకన్న మృతి చెందడంతో ఊట్లపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మనవడిపై మమకారంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెళ్లిన తాత మరణం స్థానికులను కంటతడి పెట్టించింది. ఇలాంటి తెరిచి ఉంచిన బోరు బావుల విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు