GHMC MEETING : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వార్షిక బడ్జెట్ ఆమోదం, మేయర్‌పై అవిశ్వాసం అంశాలు సమావేశంలో ప్రధాన ఎజెండాలు కానున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను రూ.8,340 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు.
Also Read : టెన్త్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
మద్యాహ్నాం జరిగే సర్వసభ్య సమావేశంలో ప్రధాన సమస్యలపై అన్ని పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన సమావేశం ఆరునెలలైనా జరగకపోవడం, వచ్చేది ఎన్నికల ఏడాది కావడం, జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు మందకోడిగా సాగడంపై ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ వేడి అలుముకున్నది. మొత్తంగా గతంలో కంటే సమావేశం వాడీ వేడీగా జరిగే అవకాశం ఉంది.
Also Read: కేజ్రీవాల్‌కు హర్యానా CM దిమ్మతిరిగే కౌంటర్: స్వయంగా యుమునా నదిలో..
కాగా కౌన్సిల్‌లో 150 మంది సభ్యులకు గాను 146 మంది సభ్యులున్నారు. నేటి సమావేశానికి సంబంధించి సభ్యులు 125 ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. కానీ మేయర్ వాటన్నింటిని కాదని కేవలం 21 ప్రశ్నలకు మాత్రమే సమాదానం చెప్పడానికి అవకాశం ఉంది. దీంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు మేయరపై మండిపడుతున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నల్లో ఎక్కువగా రోడ్ల నిర్వహణ, టౌన్ ప్లానింగ్, దోమలు, కుక్కలు, శానిటేషన్ అంశాలపై ఉన్నాయి. అయితే 125 ప్రశ్నల్లో కేవలం 21 మాత్రమే ఎంపిక చేసి మిగిలినవాటిని పక్కన పెట్టడం పట్ల బీఆర్‌ఎస్ సీరియస్‌గా ఉంది. కేవలం కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నలకు మాత్రమే ఆమోదం తెలిపి మిగిలినవారి ప్రశ్నలను పక్కన పెట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. దీనిపై ఆయా పార్టీలు నిలదీసే అవకాశం ఉంది.మరోవైపు బడ్జెట్ ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్ మామూలుగా లేదుగా!
ఇక బీఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన మేయర్‌పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం చెందే అవకాశం లేదని బల్దియా వర్గాలు అంటున్నాయి. కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు టార్గెట్ చేయనున్నారు. మేయర్‌ను నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. మరోవైపు కౌన్సిల్‌లో ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ కూడా వ్యూహారచన చేసింది. నిన్న సాయంత్రం ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మేయర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భేటీ అయ్యి కౌన్సిల్ వ్యూహాలపై చర్చించారు. ఈ రోజు ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లకు మంత్రులు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇటీవల గ్రేటర్ బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులంతా కమిషనర్ ఇలంబర్తిని కలిసి నియోజకవర్గాల వారీగా సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించారు. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్‌లో చేరిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్‌రెడ్డిపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు.
Also Read : NEET సీట్ల కేటాయింపుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, కార్పొరేటర్లు ఆందోళన చేపట్టే అవకాశముందని సమాచారంతో బందోబస్తును పెంచినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ఆవరణంలో ఆంక్షలు విధించనున్నారు. దీంతోపాటు కౌన్సిల్ సమావేశంలో ఆందోళనకు దిగితే సభ్యులను నియంత్రించడానికి మార్షల్స్‌ను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 10 న మేయర్,డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
Also Read : ప్లే స్టోర్ లో డీప్ సీక్ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!