/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tiger-jpg.webp)
TG News: పులిదాడిలో మరణించిన యువతి లక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ఈజ్గాంలో లక్ష్మి అనే యువతి పత్తి ఏరేందుకు వెళ్లగా అక్కడ పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా గన్నారం మండల వాసి అయిన లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సురేఖ.. యువతి మరణించడం తనను ఎంతో వేదనకు గురి చేసిందని చెప్పారు. అటవీ శాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ అవసరాల మేరకు తగిన విధంగా సహాయ, సహకారాలను అందిస్తామని తెలిపారు.
అటవీ శాఖ సూచనలు పాటించాలి..
అలాగే సిర్పూర్ మండలంలోని దుబ్బగూడెంలో సురేష్ అనే రైతుపై మరో దాడి ఘటన జరగడంపై సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డిఎఫ్ఓ నీరజ్ రైతు పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాథమిక చికిత్స అనంతరం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా హాస్పిటల్ కు సురేష్ ను తరలిస్తున్నట్టు డిఎఫ్ఓ మంత్రికి వివరించారు. పులి కదలికలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర వైపు పులి కదలికలను గుర్తించినట్టుగా డిఎఫ్ఓ మంత్రికి తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పశువులపై కూడా పులి దాడి ఘటనలు నమోదైన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పిసిసిఎఫ్ ను ఆదేశించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువులను మేతకు తీసుకొని పోయేవారు జాగ్రత్తగా ఉండాలనీ, అటవీ శాఖ సూచనలను పాటించాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: RS Praveen Kumar: చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి
పులి సంచారానికి సంబంధించిన జాడలు కనిపించడం, పులిని చూసినట్లుగా ఎవరైనా సమాచారం అందించిన పక్షంలో సమీప ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని అటవీ అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలని అటవీ అధికారులను నిర్దేశించారు. రాకపోకల సందర్భంగా పులి నుంచి ప్రమాదం పొంచి ఉందని భావించిన పరిస్థితుల్లో పులి దాడి నుంచి బయటపడడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సురేఖ అటవీ అధికారులకు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ కేసు.. ముగ్గురు మాజీ క్రికెటర్లు అరెస్టు