Telangana Municipal Elections 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో  తెరపడింది.

New Update
me

తెలంగాణలో మున్సిపల్ ఎన్నిక(Telangana Municipal Elections 2026) ల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో  తెరపడింది. ఎల్లుండి జరిగే పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం(election-commission) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన ప్రధాన పట్టణాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 

ఈ ఎన్నికలు ప్రధానంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరుగుతుండగా, మొత్తం 414 వార్డు డివిజన్లు, 2,582 మున్సిపల్ వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. రాజకీయ దిగ్గజాల నుంచి యువ నాయకుల వరకు మొత్తం 12 వేల 993 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Also Read :  కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌కు ఓటేయమన్న మహిపాల్ రెడ్డి

మొత్తం 52,43,023 మంది ఓటర్లు

ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 26.80 లక్షలుగా ఉండగా, పురుష ఓటర్లు 25.62 లక్షలుగా ఉన్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో, పోలీసులు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

మద్యం దుకాణాలను మూసివేయడంతో పాటు, బయటి వ్యక్తులు ఎవరూ పట్టణాల్లో ఉండకూడదని ఆంక్షలు విధించారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమ ఓటును వేయాలని అధికారులు,  రాజకీయ నాయకులు పిలుపునిస్తున్నారు.

ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం పరోక్ష పద్ధతిలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

Also Read :  మద్యం ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా వైన్స్ షాపులు బంద్!

Advertisment
తాజా కథనాలు