రైతులకు గుడ్న్యూస్.. ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్ రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. ఈ సీజన్ నుంచే సన్నవడ్లకు ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. By B Aravind 03 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు. గత సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని.. ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ''ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పాం. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా.. ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించాం. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి తప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని'' సీఎం రేవంత్ అన్నారు. సన్నవడ్ల సేకరణకు వీలుగా వేరువేరు కొనుగోలు కేంద్రాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. సన్న వడ్లు కొనేటప్పుడు నిర్దేశించిన ప్రమాణాలు తప్పకుండా పాటించాలని అధికారులను అప్రమత్తం చేశారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్న వడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదముందని.. అలాంటి తప్పులు, అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రతీ కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలని సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్ మాల్ జరిగినా ఎక్కడ జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. Also Read: టాలీవుడ్ Vs రేవంత్.. ఇంతటితో ఆపకపోతే తాట తీస్తాం! సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీసులకు ఆదేశించారు. అన్ని మార్గాల్లోనూ పకడ్బందీగా నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. తాలు ,తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించవద్దని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి రోజు కలెక్టర్లు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలని, ప్రతి రోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలుంటే ఏ రోజుకారోజు సమస్యలు పరిష్కరించాలని, సివిల్ సప్లయిస్ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. Also Read: రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే! ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగు చేసిన విస్తీర్ణంలో 58 శాతం సన్న రకాలు సాగయ్యాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల దిగుబడి మరింత పెరుగుతుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ట్రంలో వంద శాతం సన్న వడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని, ఎఫ్సీఐ వద్ద కూడా భారీగా నిల్వలున్నాయని, అందుకే సన్న రకపు వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈసారి దిగుబడి అయ్యే 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు, మిల్లర్లు, కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కనపెడితే 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉంటాయని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలోనూ కలెక్టర్లు నిబంధనలను పాటించాలని సూచించారు. గతంలో వరుసగా బకాయి పడ్డ డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని చెప్పారు. మిగతా మిల్లర్లకు కూడా బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం ఇవ్వాలని సూచించారు. #cm-revanth #telugu-news #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి