BIG BREAKING: స్కూల్‌ విద్యలో ఇంటర్ విలీనం లేనట్లే.. యథావిధిగా ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు

ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనపై తలెత్తిన సాంకేతిక సమస్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2026-27)ఇంటర్మీడియట్ అడ్మిషన్లను పాత పద్ధతిలోనే (యథావిధిగా) కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

New Update
Delhi Government's Big Step To Regulate School Fees Amid Complaints

Telangana CM Revanth Reddy orders continuation of Intermediate admissions..

BIG BREAKING:  తెలంగాణలో పదో తరగతి పూర్తయి, పైచదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ విద్యా సంవత్సరం (2026-27) ఇంటర్మీడియట్ అడ్మిషన్లను ఎలాంటి మార్పులు లేకుండా పాత పద్ధతిలోనే (యథావిధిగా) కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనపై తలెత్తిన సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఆదివారం  హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ బోర్డు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం పాఠశాల విద్య (పదో తరగతి వరకు), ఇంటర్మీడియట్ విద్య వేర్వేరు బోర్డుల పరిధిలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో అత్యధికులు.. ఆ తర్వాత దూర ప్రాంతాల్లో ఉండే జూనియర్ కళాశాలల్లో చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో డ్రాపౌట్స్ (చదువు మధ్యలో ఆపేసేవారి) సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించడానికి సీబీఎస్‌ఈ (CBSE), దేశంలోని మెజారిటీ రాష్ట్రాల తరహాలోనే ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి, పాఠశాల విద్యలోనే విలీనం చేస్తూ 11, 12 తరగతుల విధానాన్ని అమలు చేయాలని 'తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్' ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనివల్ల పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు నేరుగా అదే పాఠశాల పరిధిలోనే ప్లస్ టూ (11, 12 తరగతులు) పూర్తి చేసే అవకాశం లభిస్తుందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

ఎడ్యుకేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు విలీన ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 4వ తేదీన ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, మరుసటి రోజే (మే 5న) ఆ అడ్మిషన్ల షెడ్యూల్‌ను బోర్డు హఠాత్తుగా రద్దు చేసింది. విలీన ప్రక్రియ కారణంగా అడ్మిషన్లు నిలిచిపోవడంతో.. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు జరుగుతాయా లేదా అనే అయోమయం నెలకొంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.ఈ ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసరంగా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.

 ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడంలో అనేక సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు ముడిపడి ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. టీచర్ల సర్వీస్ రూల్స్, కేడర్ విభజన, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం చాలా తక్కువగా ఉండటంతో.. ఈ తక్కువ వ్యవధిలో విలీనం సాధ్యం కాదని అధికారులు వివరించారు.

 అధికారుల వివరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు. విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తూ, ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థి విద్యా సంవత్సరం వృథా కాకూడదని స్పష్టం చేశారు. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు మరియు ప్రైవేట్ యాజమాన్యాలతో సహా అన్ని వర్గాల (భాగస్వాముల)తో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని సూచించారు.

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ ఈ సాంకేతిక సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని, ఆ తర్వాత దీనిని శాసనసభ (అసెంబ్లీ)లో చర్చకు పెట్టి సభ్యుల అభిప్రాయాల మేరకే విలీనంపై తుది నిర్ణయం తీసుకుందామని సీఎం స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ సముచిత నిర్ణయంతో ఇంటర్ బోర్డు త్వరలోనే సరికొత్త ప్రవేశాల (అడ్మిషన్ల) షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. దీంతో గత కొద్దిరోజులుగా నెలకొన్న రాజకీయ, విద్యాపరమైన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది.

Advertisment
తాజా కథనాలు