CM Revanth Reddy :  గ్రూప్‌-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హార్షం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

New Update
FotoJet (6)

Supreme Court verdict on Group-1 appointments

CM Revanth Reddy : తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఈ నేపథ్యంలో తీర్పుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, కన్నవారి కష్టం పై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులకు ఇది పెద్ద ఊరటనిచ్చిందని సీఎం అభిప్రాయ పడ్డారు. ప్రజా ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసి, ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించిందని స్పష్టం చేశారు.రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్ -1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. వారికి మరో సారి నా అభినందనలు అని సీఎం తెలిపారు.

ప్రభుత్వం ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించి, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..

కాగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చేపట్టిన 563 గ్రూప్‌–1 పోస్టుల నియామక ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్‌–1 నియామకాలకు ఆమోదం తెలుపుతూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం తుది తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. గ్రూప్‌–1 మెయిన్స్‌ సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పి. ఆదిత్య అనే వ్యక్తితో పాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. నియామక ప్రక్రియలో కమిషన్‌ అనుసరించిన విధానాలను తప్పుబట్టలేమని తేల్చి చెప్పింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియామకాలను సమర్థించిందని.. ఆ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతూ పిటిషన్లను కొట్టేసింది.

 అయితే మూడో విడత మూల్యాంకనంలో బార్‌కోడింగ్‌ లేకపోవడం మూలంగా అక్రమాలకు ఆస్కా రం ఏర్పడిందని.. సుమారు 924 మంది అభ్యర్థుల ఎంపికలో వ్యత్యాసాలు ఉన్నాయ ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. జవాబుల ‘కీ’లోనూ లోపాలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల సందర్భంగా మూల్యాంకన విధానం, బార్‌కోడింగ్‌ మినహాయింపు తదితర సాంకేతిక అంశాలపై ధర్మాసనం కమిషన్‌ను ప్రశ్నించింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం కమిషన్‌ వాదనలతో ఏకీభవించిన న్యాయ స్థానం.. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకున్న తర్వాత పిటిషన్లను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.  

Advertisment
తాజా కథనాలు