Jewelry robbery : కరీంనగర్‌ PMJ జ్యువెలరీలో కాల్పులు.. ఒకరి మృతి, భారీగా నగలు దోపిడీ ?

కరీంనగర్  జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టపగలు  ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో ఉలిక్కిపడింది. జ్యోతినగర్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న PMJ జ్యువెలరీ షాపులోకి ఐదుగురు సాయుధ దుండగులు చొరబడి బీభత్సం సృష్టించారు.

New Update
FotoJet - 2026-05-03T125050.656

Shooting at PMJ Jewelry in Karimnagar

Jewelry robbery : తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, అడ్డువచ్చిన సిబ్బందిని తుపాకులతో కాల్చి భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

 ఉదయం 10 గంటల సమయంలో సిబ్బంది షాపును తెరిచి, లాకర్‌లోని బంగారు ఆభరణాలను కౌంటర్లలో డిస్‌ప్లే పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించారు. లోపలికి రాగానే భయాందోళన సృష్టించేందుకు దుండగులు గాలిలోకి , సిబ్బందిపై సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందితో సుమారు 20 నిమిషాల పాటు పెనుగులాట జరిగింది.

 దుండగులు జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో షాపులో పనిచేస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం దుండగులు కౌంటర్లలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని, బైకులపై వేగంగా పరారయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో పడి ఉన్న రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు షాపులోని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు ముందుగానే ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి, షాపు తెరిచే సమయాన్ని ఖచ్చితంగా ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు
నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు నాకాబందీ (తనిఖీలు) చేపట్టారు. షాపుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. జనసంచారం ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతంలో ఇంతటి సాహసోపేతమైన దోపిడీ జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దోచుకెళ్లిన నగలు ఎంత మొత్తంలో ఉంటాయనేది లెక్కించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు