/rtv/media/media_files/2025/03/15/pIjZSnsZ9XCcsiTrZv80.jpg)
Potti sri ramulu University
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ పేరు మార్పిడి బిల్లు కూడా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. పదో షెడ్యూల్‌లో ఈ వర్సిటీ ఉండటంతో ఇప్పటివరకు పేరు మార్చలేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్‌ను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ పేరు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఈరోజు దీనికి సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు. 1985 డిసెంబర్ 2న పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ వర్శిటీ ఇదే పేరుతో కంటిన్యూ అయి వస్తూ ఉంది.
సురవరం ప్రతాపరెడ్డి...
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న జన్మించారు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి మారు పేరు సురవరం. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, క్రియాశీల ఉద్యమకారుడుగా ఈయన కీర్తి గడించారు. తెలంగాణలో పుట్టిన 354 మంది కవుల జీవిత విశేషాలతో వేసిన గోల్కొండ కవుల సంచిక అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పట్టున్న సురవరం.. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం అనే పుస్తకాలను కూడా రచించారు.