Population census : తెలంగాణలో రేపటి నుంచే జనాభా లెక్కలు...సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో జనగణన

తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత అత్యంత కీలకమైన జనగణన (Census) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇల్లూ, ప్రతి వ్యక్తి వివరాలను సేకరించేలా పకడ్బందీ ప్రణాళికను తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరి ప్రకటించారు. రేపటి నుంచే నమోదు కార్యక్రమం.

New Update
FotoJet - 2026-04-25T155149.564

Bharati Holikeri

Population census : తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత అత్యంత కీలకమైన జనగణన (Census) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇల్లూ, ప్రతి వ్యక్తి వివరాలను సేకరించేలా పకడ్బందీ ప్రణాళికను తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరి ప్రకటించారు. ఈసారి జనగణనలో మునుపెన్నడూ లేని విధంగా డిజిటల్ విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ బృహత్తర ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డిజిటల్ పద్ధతిలో జనగణన..

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జనగణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబోతున్నారు. ఎక్కడా పెన్ను, కాగితం వాడకుండా ఎన్యుమరేటర్లు నేరుగా మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. ఈ భారీ ప్రక్రియ మొత్తం రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో భాగంగా ఇళ్ల గణనతో పాటు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 26, 2026 నుంచి మే 9 వరకు ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. 

ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరో 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది. మొబైల్ నంబర్, ఇతర మౌలిక వివరాలను పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ లభిస్తుంది. అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారు తమ ఐడీని ఎన్యూమరేటర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఇళ్ల గణనలో భాగంగా బడి, గుడి, ఆస్పత్రి, గుడిసె, అద్దె ఇల్లు ఇలా తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి నిర్మాణాన్ని లెక్కిస్తారు. ఒకే భవనంలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు నివసిస్తుంటే ప్రతి కుటుంబాన్ని విడివిడిగా పరిగణనలోకి తీసుకుంటారు. 

మొదటి దశలో గృహాలకు సంబంధించి మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు సేకరిస్తారు. ఇక రెండో దశ ప్రక్రియ ఫిబ్రవరి 9, 2027న ప్రారంభమై ఫిబ్రవరి 28, 2027 వరకు కొనసాగుతుంది. ఈ దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడుతోంది. ఎక్కడా పెన్ను, కాగితం వాడకుండా ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలోని మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. ప్రజలు తమ వివరాలు చెప్పేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా సమాచారం కావాలన్నా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1855 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో ఈ వివరాలు అత్యంత కీలకం కానున్నాయి.

Advertisment
తాజా కథనాలు