/rtv/media/media_files/2026/06/02/pawankalyan-2026-06-02-16-51-19.jpg)
జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమం, ఇక్కడి యువత చేసిన పోరాటం తనకు ఎప్పటికీ ఆదర్శమని, వారి బలిదానాలు తనను తీవ్రంగా కదిలించాయని చెప్పారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ అమరవీరులను సరిగ్గా గుర్తించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 1200 మంది అమరులను ఇంకా ఎన్నేళ్లకు గుర్తిస్తారని ఆయన ప్రశ్నించారు. అమరవీరుల గౌరవార్థం తాము ఒక సభ పెట్టుకుంటే దానికి కూడా ఇక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ నేల కోసం జనసేన ఎల్లప్పుడూ తనవంతు కృషి చేస్తుందని చెబుతూ.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమరవీరులకు నివాళులర్పించడానికి కూడా పర్మిషన్ కావాలా ఆని పవన్ ప్రశ్నించారు.
మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్
మరోవైపు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీతో ఉన్న రాజకీయ ఒప్పందంలో భాగంగానే, వారి కనుసన్నల్లోనే పవన్ కల్యాణ్ విభజన అంశాలపై మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేవలం తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్‌ను అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
బీజేపీ ఆడించే తోలుబొమ్మ
పవన్ కల్యాణ్ సొంతంగా మాట్లాడటం లేదని, బీజేపీ నేతలు వెనుక ఉండి ఏం పలికిస్తే దాన్నే మాట్లాడుతున్నారని.. ఆయన కేవలం బీజేపీ ఆడించే తోలుబొమ్మ అని మహేష్ గౌడ్ విమర్శించారు. తెలంగాణను కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని, వారి మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించారు. చివరగా పవన్ కల్యాణ్‌ను హెచ్చరిస్తూ.. తెలంగాణ ప్రజలను గౌరవించకుంటే ఇక్కడ నీ సినిమాలు కూడా ఆడవు అంటూ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Follow Us