Kalvakuntla Kavitha : అడవిలో అన్నలు లేరనే అధికారుల ఆగడాలు.... కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగింది. తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. "గతంలో అడవిలో అన్నలు ఉంటే ఇక్కడ ఒక ధైర్యం ఉండేది, సింగరేణి అధికారులు కూడా పద్ధతిగా లంచాలు లేకుండా పనిచేసేవారన్నారు.

New Update
FotoJet

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు ఆమె చేపట్టిన 'బాయిబాట' (బొగ్గుబాయి) పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగడమే కాకుండా, రాజకీయ వర్గాలలో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. కార్మికులను వేధిస్తే ఊరుకునేది లేదంటూ ఆమె యాజమాన్యానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 భూగర్భ గని వద్ద కవిత పర్యటన సందర్భంగా హైడ్రామా నడిచింది. గని ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, తన అనుచరులు మరియు కార్మిక సంఘాల నాయకులతో కలిసి పోలీసుల బారికేడ్లను, గేట్లను తోసుకుంటూ గని ఆవరణలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో సింగరేణి సిబ్బందికి, హెచ్ఎంఎస్ కార్మికులకు మరియు టీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి మాట్లాడిన కవిత, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఇదే సింగరేణిలో పర్యటించలేదా అని ఆమె నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు అధికారంలో ఉంటారని ప్రశ్నిస్తూ.. కార్మికుల సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఒకవైపు పాత టెక్నాలజీతోనే పనులు చేయిస్తూ, మరోవైపు లాభాల వాటాల పంపిణీలో ప్రతియేటా కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీవ్ర అన్యాయం చేస్తోందని, మహిళా ఉద్యోగులకు కనీస తాగునీరు, ఇతర సౌకర్యాలు కూడా కల్పించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఇదే వేదికపై కవిత మావోయిస్టులను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. "గతంలో అడవిలో అన్నలు (మావోయిస్టులు) ఉంటే ఇక్కడ ఒక ధైర్యం ఉండేది, సింగరేణి అధికారులు కూడా పద్ధతిగా లంచాలు లేకుండా పనిచేసేవారు. ఇప్పుడు అడవిలో అన్నలు లేరు కాబట్టి, తమను అడిగే దిక్కు ఎవరూ లేరని సింగరేణి యాజమాన్యం భావిస్తూ కార్మికులను వేధిస్తోంది. కానీ గుర్తుపెట్టుకోండి.. అడవిలో ఉన్న అన్నలందరూ ఇప్పుడు మా పార్టీ (టీఆర్‌ఎస్) లోనే ఉన్నారు" అంటూ కవిత సంచలన ప్రకటన చేశారు. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని, అవసరమైతే తాము న్యాయపరంగా కూడా ముందుకెళ్తామని హెచ్చరించారు.

కవిత చేసిన ఈ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ నేపథ్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. కేవలం రెండు వారాల క్రితమే ఆమె మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వయంగా కలిసి పరామర్శించారు. దాదాపు 40 ఏళ్లపాటు అజ్ఞాతంలో గడిపి, ఇటీవలనే అనారోగ్య కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్ జీతో పాటు, మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సైతం ప్రస్తుతం జనజీవన స్రవంతిలో ఉన్నారు. ఈ మాజీ విప్లవ నేతల క్షేమసమాచారాలను కవిత దగ్గరుండి చూసుకోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో, అజ్ఞాత జీవితాన్ని వీడిన మాజీ మావోయిస్టు నేతలు త్వరలోనే కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేనలో చేరి, ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సింగరేణి బెల్ట్‌పై పట్టు సాధించే వ్యూహంలో భాగంగానే కవిత ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, "అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు, బిడ్డా జాగ్రత్త!" అంటూ కవిత ఇచ్చిన హెచ్చరికలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు