తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) స్పందించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను ఓ హోటల్‌లో విందుకు ఆహ్వానించారని తెలిపారు. ఈ విందు సందర్భంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై చర్చించారని చెప్పారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారంటూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కేవలం బీఆర్‌ఎస్ ఆడుతున్న నాటకంలో ఒక భాగమన్నారు. ప్రచారం జరుగుతున్నట్లు ఎమ్మెల్యేలెవరూ పార్టీ వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మల్లురవి వాస్తవానికి సమావేశం అయ్యింది కూడా పదిమంది కాదని, 8 మంది మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. వీరంతా పార్టీ మారుతున్నారని బీఆర్‌ఎస్ మీడియాకు లీకులిచ్చిందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలు పెట్టిందని మండి పడ్డారు.
Also Read : తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్‌లైన్ వీడియోలతో లక్షల్లో టోకరా!
Mallu Ravi
నిన్న జరిగిన ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కె. రాజేశ్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో సహా పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.
ఓ మంత్రి తమను పట్టించుకోవడంలేదని, తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే ఆ మంత్రి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పలు రూమర్స్ వెలువడ్డాయి. కొంతమంది బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారనే విమర్శలు వినిపించాయి.
Also Read : దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థల్లో సీబీఐ సోదాలు..
అయితే రహస్యంగా భేటీ అయిన ఎమ్మెల్యేలు పాలమూరు ఎమ్మెల్యేలు అని, వారి వారి నియోజకవర్గాలలో పనులు కాకపోవడం, బిల్లుల విషయంలో అసంతృప్తికి గురైన వీరు రహస్యంగా సమావేశం అయ్యారంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని ఎనిమిది ఎమ్మె్ల్యేలతో మాట్లాడానని వారంతా పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. పార్టీ మారాల్సిన అవసరం ఏ మాత్రం లేదని మల్లు రవి స్పష్టం చేశారు.
Also Read : 2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?
Also Read : వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్