PNG Supply Hyderabad : ఇక సిలిండర్‌ అక్కరలేదు..నేరుగా ఇళ్లకే గ్యాస్ పైపులైన్లు.. త్వరలోనే ఆ జిల్లాల్లో షురూ..

ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పైపుల ద్వారా నేరుగా ఇళ్లకు సహజ వాయువు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి  ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

New Update
FotoJet (47)

 PNG Supply Hyderabad

PNG Supply Hyderabad :  గ్యాస్‌ సిలిండర్‌ సమయానికి దొరకపోతే ఎంతటి ఇబ్బందులు ఉంటాయో మనకు పశ్చిమాసియా యుద్ధం గుర్తు చేసింది. ఒకపుడు ఈ రోజు బుక్‌ చేస్తే రేపు వచ్చే గ్యాస్‌ ఇపుడు నెల అయినా వస్తదన్న గ్యారంటీ లేదు. ఇక కమర్శియల్‌ గ్యాస్‌ అయితే దొరకడమే గగణమైంది. కమర్శియల్‌ గ్యాస్‌ దొరకక పలు హాస్టళ్లు, మెస్‌లు, హోటళ్లు మూతపడ్డాయి. పలు హోటళ్లు ధరలు పెంచి విక్రయిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు తలెత్తకుండా ఉండటం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తోంది.

 ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి  ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను  పూడూరు ప్లాంట్ ద్వారా తీసుకుని  నేరుగా ఇళ్లకు సరఫరా చేసేందుకు భాగ్యనగర్, మెగాసిటీ గ్యాస్ ఏజెన్సీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దీనికోసం అవసరమైన పైప్‌లైన్ల ఏర్పాటుకు 24 గంటల్లోనే వాట్సప్ ద్వారా అనుమతులు ఇచ్చేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం.
 
 ఇరాన్-ఇజ్రెయిల్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీనితో బుక్ చేసిన నెల రోజులకు కూడా సిలిండర్ దొరకని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా గ్యాస్ సరఫరా మరింత ముదరక ముందే ఇంధన భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు ఎదుర్వకుండా ఉండేందుకు పైపుల ద్వారా సహజ వాయువును ( Piped Natural Gas ) డైరెక్ట్‌గా ఇళ్లకు సరఫరా చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌లో ఈ ప్రాజెక్టును పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని భావిస్తున్నాయి. అయితే గతంలో హైదరాబాద్‌ నగరంలోనూ పలు కాలనీల్లో పైపు లైన్‌ ద్వారా గ్యాస్‌ను అందించడానికి పైపులైన్లను సైతం ఇంటింటికీ ఏర్పాటు చేశారు. అయితే అనుమతులు రాలేదన్న కారణంతో గ్యాస్‌ సరఫరా జరగలేదు. కానీ, ఆ ఫైప్‌ లైన్లు అలాగే ఉండిపోయాయి. ఆయా ప్రాంతాల్లోనూ వీటిని వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
 
అయితే  ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి బేసిన్. కాకినాడ నుంచి ముంబై మీదుగా అహ్మదాబాద్ వరకు సాగే ప్రధాన గ్యాస్ పైప్‌లైన్ మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామం మీదుగా వెళ్లనుంది. దీంతో పూడూరు గ్రామంలో ఉన్న ఎల్పీజీ నిల్వ ప్లాంట్ ద్వారా గ్యాస్‌ను సేకరిస్తారు. దాన్ని అక్కడి నుంచి భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ లిమిటెడ్, మెగాసిటీ గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు డైరెక్ట్‌గా పంపిణీ చేయనున్నాయి. ఇలా నేరుగా గ్యాస్‌ సరఫరా చేయడం వల్ల సిలిండర్ల బుకింగ్, డెలివరీ కోసం వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, మనుచౌదరిలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక  పైప్‌లైన్ల నిర్మాణానికి రోడ్లు తవ్వాల్సి ఉంటుందని కనుక దీని కోసం దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇచ్చేలా ప్రత్యేక కమిటీని కూడా నియమించినట్లు తెలుస్తోంది.

ఈ అనుమతులను సులభతరం చేయడానికి ఒక ప్రత్యేక వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏజెన్సీలు ఎవరైనా తమ దరఖాస్తులను ఇందులోనే పంపాల్సి ఉంటుంది. మొదటి విడతలో భాగంగా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని తొమ్మిది మున్సిపాలిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎన్‌జీ వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా.. సురక్షితంగా నిరంతరాయంగా గ్యాస్‌ అందుబాటులో ఉంటుంది.ఈ సౌకర్యం  గృహ వినియోగదారులకే కాకుండా అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు అందుబాటులోకి రానుంది. ఈ పైప్‌లైన్ నెట్‌వర్క్ పూర్తయితే.. ఆ తర్వాత హైదరాబాద్ వెలుపల కూడా ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు