Telangana : ప్రేమ గెలిచింది, ప్రాణం ఓడింది: వారంలోనే అనంతలోకాలకు వెళ్లిన జంట!

వారిద్దరూ కలిసి బతకాలనుకున్నారు.. ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ జంట మృత్యువులోనూ విడిపోలేకపోయింది. కళ్లముందే భర్త చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే చూడలేకపోయింది ఆ ఇల్లాలు.

New Update
love marriage

వారిద్దరూ కలిసి బతకాలనుకున్నారు.. ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ జంట మృత్యువులోనూ విడిపోలేకపోయింది. కళ్లముందే భర్త చావుబతుకుల్లో కొట్టుమిట్టాడు తుంటే చూడలేకపోయింది ఆ ఇల్లాలు.. ఆయన లేని లోకంలో తను ఉండలేనని ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. చివరకు విధి వెక్కిరించిందో ఏమో గానీ, భార్య వెళ్లిన ఆరు రోజులకే ఆ భర్త కూడా కన్నుమూశాడు. పెళ్లయి ఏడాది తిరగకముందే ఆ పచ్చని సంసారాన్ని మృత్యువు కబలించింది.

గోదావరిఖని (godavarikhani) లో ఒకే వారంలో ఇలా భార్యాభర్తలు ఇద్దరూ మరణించడం అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన కంబాల నరేష్ (34) సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి 14 నెలల క్రితం గొల్లపల్లికి చెందిన మమత (29)తో ప్రేమ వివాహం(love-marriage) జరిగింది. వీరిద్దరూ గోదావరిఖనిలో అద్దె ఇంట్లో ఉండేవారు.

Also Read :  హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్లో కలకలం.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

అసలేం జరిగిందంటే.. 

ఈ నెల 16న శివరాత్రి పూజలు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేష్, మరుసటి రోజు నిద్రమత్తులో మొదటి అంతస్తు మెట్ల పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స కోసం అతడిని కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, నరేష్ బతికే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెప్పడంతో భార్య(wife) మమత తట్టుకోలేకపోయింది. తన భర్త(husband) కోలుకోడనే బాధతో ఈ నెల 17న ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దురదృష్టవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేష్ కూడా ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. పెళ్లైన ఏడాదికే ఇద్దరూ మరణించడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. మరోవైపు, మమత తండ్రి ఫిర్యాదు మేరకు నరేష్ కుటుంబ సభ్యులపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం కోసం వేధించారని, ఆస్పత్రి దగ్గర కూడా తన కూతురిని దూషించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  చల్లారని కామారెడ్డి చిచ్చు.. బీజేపీ చీఫ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Advertisment
తాజా కథనాలు