/rtv/media/media_files/2025/03/24/mECeCqkkhmpfhqECU0Xr.jpg)
DOST 2026 Admissions
DOST: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఉన్నత విద్యామండలి సంకల్పం ఎట్టకేలకు నెరవేరింది. సాంకేతిక విద్యామండలి, విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎదురైన అనేక అడ్డంకులను అధిగమించి, డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ ‘దోస్త్’ (DOST) మూడో విడత కౌన్సెలింగ్‌లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో ఉన్నత విద్యామండలి విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న ఈ కోర్సుల వైపు విద్యార్థులు డిమాండ్ చూపిస్తుండటంతో, ఇప్పటికే 67 కళాశాలలు తమ వద్ద డిమాండ్ లేని పాత కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని, ఈ కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
అయితే, ఈ సరికొత్త కోర్సులను దోస్త్‌లోకి తీసుకురావడం వెనుక పెద్ద హైడ్రామానే నడిచింది. నిపుణుల కమిటీలతో దాదాపు ఏడాది పాటు కసరత్తు చేయించి, రూ. 25 లక్షల భారీ బడ్జెట్‌తో విద్యామండలి ఈ కోర్సుల సిలబస్‌ను రూపొందించింది. ప్రారంభంలో అన్ని వర్సిటీలు వీటికి ఆమోదం తెలిపినప్పటికీ, ఇవి ఇంజనీరింగ్ కోర్సులతో సమాంతరంగా ఉండటంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు రంగంలోకి దిగాయి. విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి, వర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (BOS) అనుమతులు రాకుండా లాబీయింగ్ చేశాయి. ఫలితంగా మొదటి రెండు విడతల దోస్త్ కౌన్సెలింగ్‌లో ఈ కోర్సులు విద్యార్థులకు ఆప్షన్లలో కనిపించకుండా సాంకేతిక విద్యామండలి అడ్డుకోగలిగింది.
ఈ పరిణామాలను సవాల్‌గా తీసుకున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఈ వివాదాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి నేరుగా ముఖ్యమంత్రి (CMO) దృష్టికి తీసుకెళ్లారు. విద్యాశాఖ అధికారుల ఏకపక్ష వైఖరి , ప్రైవేట్ కాలేజీల లాబీయింగ్‌పై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసే ఉపాధి కోర్సులను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎంఓ, తక్షణమే వీటిని మూడో విడత కౌన్సెలింగ్‌లో చేర్చాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి జోక్యంతో లీగల్,అడ్మినిస్ట్రేటివ్ అడ్డంకులన్నీ తొలగిపోయి, చివరికి విద్యామండలిదే పైచేయిగా నిలిచింది.
ప్రస్తుతం దోస్త్ మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో విద్యార్థులు ఈ నయా కోర్సులపై భారీగా ఆప్షన్లు ఇస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు ఆప్షన్ల నమోదుకు గడువు ఉండగా, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం కంప్యూటర్, సైబర్ సెక్యూరిటీ ఆధారిత కోర్సులపై తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఇంటర్నల్ స్లైడింగ్ లేదా కాలేజీ మార్పు ద్వారా ఈ సరికొత్త కోర్సుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. చివరి నిమిషంలో ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో, ఆప్షన్లు ఇచ్చుకునేందుకు మరికొంత సమయం కావాలని విద్యార్థులు విద్యామండలి చైర్మన్‌ను స్వయంగా కలిసి, ఫోన్ల ద్వారా గడువు పొడిగింపును కోరుతున్నారు.
ఈ కొత్త కోర్సుల ద్వారా అకడమిక్ చదువులతో పాటు పారిశ్రామిక అవసరాలకు (Industrial Needs) తగినట్లుగా విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇవి సరికొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు కావడంతో కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ప్రమాణాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ భావిస్తున్నారు. అందుకోసం విద్యామండలి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని (Monitoring Committee) ఏర్పాటు చేసే ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు. తద్వారా కోర్సుల నాణ్యత దెబ్బతినకుండా పారిశ్రామిక రంగానికి అవసరమైన నిపుణులను డిగ్రీ స్థాయిలోనే తయారు చేయవచ్చని విద్యామండలి విశ్వసిస్తోంది.
రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల వారీగా అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సుల వివరాలు పరిశీలిస్తే..
ఉస్మానియా వర్సిటీ పరిధిలో ..బీకామ్ ఫైనాన్స్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు వచ్చాయి.
కాకతీయ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ వర్సిటీల పరిధిలో బీఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, సైబర్ గవర్నెన్స్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
శాతవాహన, తెలంగాణ వర్సిటీల్లో బీఎస్సీ డిజిటల్ ఫోరెన్సిక్స్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టారు.
ఈ కోర్సులు సంప్రదాయ డిగ్రీల రూపురేఖలను మార్చడమే కాకుండా, విద్యార్థులకు ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.
Follow Us