ప్రమాదంలో దామగుండం అడవి.. త్వరలో 12 లక్షల చెట్లు విధ్వంసం !

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో నౌకాదళ రాడర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 3 వేల ఎకరాల అటవీ ప్రాంతంలో ఉన్న 12 లక్షల చెట్లు తొలగించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
damagundam

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వరదలు, కరవులు తరచుగా సంభవిస్తున్నాయి. చెరువులను ఆక్రమించేయడం, చెట్లను నరికివేయడం లాంటి ప్రకృతి విరుద్ధమైన చర్యల వల్ల గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతోంది. పర్యవరణాన్ని కాపాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నా కూడా పలుచోట్ల విధ్వంసం ఆగడం లేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఏకంగా దాదాపు 3 వేల ఎకరాలున్న పచ్చని అడవి నాశనం కాబోతుంది. వికరాబాద్‌ జిల్లాలో ఉన్న దామగుండం అడవిలో వేరీ లో ఫ్రీక్వెన్సీ (VLF) రాడర్‌ స్టేషన్‌ను స్థాపించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఇందుకోసం అడవిలో ఉన్న దాదాపు 12 లక్షల చెట్లను నరికివేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌కు వందళ ఏళ్ల చరిత్ర ఉంది. అనంతరగిరి రిజర్వ్‌ ఫారెస్ట్‌ను ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సబ్‌మెరైన్స్, నౌకల కమ్యూనికేషన్ కోసం రాడర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. దాదాపు 3 వేల ఎకరాల్లో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం ఫారెస్టులో 12 లక్షల మొక్కలు నరికివేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు నౌకాదళం కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులో తాము మళ్లీ 11 లక్షల 70 వేల మొక్కలు నాటుతామని కూడా పేర్కొంది. దీన్నిబట్టి అడవిలో ఉన్న దాదాపు 12 లక్షల చెట్లను నరికేసి, అడవిని నాశనం చేసి ఈ రాడర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారని అక్కడి స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Also read: సింగరేణి, జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్‌ పవర్ ప్లాంట్‌

అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు

ఇలా చేయడం వల్ల అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. రాడర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఔషధ మొక్కలకు ప్రమాదం ఉందని, పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అడవిలో 1400 ఎకరాల్లో అంటీనా పార్క్, 1,090 ఎకరాల్లో టెక్నికల్ ప్రాంతం, 310 ఎకరాలు కార్యాలయాలకు, నివాసాలకు, అలాగే మరో 100 ఎకరాల్లో సేఫ్‌ జోన్‌ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.2500 కోట్లతో భారత నౌకాదళం ఈ రాడర్‌ కేంద్రాన్ని ఆ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. అయితే అడవి చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. 60 వేల మంది ఆ గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇప్పుడు అడవిని నాశనం చేసి ఈ కేంద్రాన్ని ఏర్పడితే, స్వచ్ఛమైన గాలి లేకుండా పోతుందని, అలాగే రేడియేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రాడర్‌ స్టేషన్‌ వద్దు

అంతేకాదు హైదరాబాద్‌కు వచ్చే మూసీ నది కూడా దామగుండం అటవీ ప్రాంతంలోనే  మూసీ నది ప్రారంభమవుతుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెట్లు కూడా అక్కడ ఉన్నాయి. 500 ఏళ్లుగా కొలువైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా అక్కడ ఉంది. పచ్చని చెట్లతో, స్వచ్ఛమైన గాలిని అందించే ఈ దామగుండం ఫారెస్టులో రాడర్ స్టేషన్ నిర్మించడం ఏమాత్రం మంచిది కాదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ను కట్టడి చేసేందుకు అడవులను పరిరక్షించాల్సి ఉండగా.. ఇప్పుడు ఏకంగా దాదాపు 3 వేల ఎకరాలున్న అడవిని ధ్వంసం చేయడం వల్ల వికారాబాద్‌ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు కూడా భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని చెబుతున్నారు. 

Also Read: 15 రోజుల్లో 4500 ఫోన్ల ట్యాపింగ్‌!

మరోవైపు అటవీ సంపదకు నష్టం వాటిల్లే అంశంపై అటవీ సంరక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్‌ కీలక ప్రకటన చేశారు. రాడార్ ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో 48 శాతం మాత్రమే స్టేషన్ నిర్మాణానికి ఉపయోగిస్తారని తెలిపారు. మిగిలిన 52 శాతం అటవీ సంపదకు ఎలాంటి నష్టం ఉండదని పేర్కొన్నారు. 12 లక్షల చెట్లను తొలగిస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం కేవలం 1.92 లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించేలా కూడా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. అక్కడ కోల్పోనున్న చెట్లకు బదులుగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో 17.55 లక్షల చెట్లను అటవీశాఖ నాటనుందని డోబ్రియాల్ తెలిపారు.

అలాగే ఆ ప్రాంతంలో 32 ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు కొలను కూడా అక్కడే ఉంటాయన్నారు. భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండని స్పష్టం చేశారు. కానీ పర్యావరణ ప్రేమికులు మాత్రం ఇందులో వాస్తవం లేదని చెబుతున్నారు. కేంద్ర నౌకాదళమే 11 లక్షల 70 వేల చెట్లు వేరే చోట నాటుతామని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలో వివరించిందని.. దీన్ని బట్టి చూస్తే అక్కడ దాదాపు 12 లక్షల చెట్లను నరికివేసే అవకాశాలే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని.. ఈ రాడర్ స్టేషన్‌ను నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాడర్ స్టేషన్‌ ఏర్పాటుపై పురణాలోచన చేయాలని ప్రభుత్వాన్నికోరుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు