/rtv/media/media_files/2026/04/10/minor-girl-harassed-on-instagram-2026-04-10-16-46-12.jpg)
Minor girl harassed on Instagram
Hyderabad Minor Girl : సోషల్ మీడియా విస్తరించడంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ అడిక్ట్ అవుతున్నారు. అయితే సోషల్ మీడియాను మంచికి వినియోగించుకుంటే పర్వాలేదు. కానీ, కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో ఇన్‌స్టాగ్రామ్ వేధింపుల మూలంగా బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుంట్లూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలిక తోటి విద్యార్థి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడంతో స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా తోటి విద్యార్థి వేధింపులే ఈ ఘాతుకానికి కారణమని తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలైన బాలిక, నిందితుడైన బాలుడు ఒకే పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. మొదట వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ఆ తర్వాత సదరు విద్యార్థి వక్రబుద్ధిని బయటపెట్టాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో ఆ బాలికను నిందితుడు లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. విద్యార్థి ప్రవర్తనపై బాలిక, ఆమె కుటుంబ సభ్యులు సీరియస్ కావడమే కాకుండా గతంలోనే పలుమార్లు హెచ్చరించారు. అయినా నిందితుడు తన ప్రవర్తన మార్చుకోక పోగా, వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక నిన్న (గురువారం) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేలోపే బాలిక విగతజీవిగా పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమ బాలికకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని తీవ్ర ఆవేదనలో ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బాలిక మృతదేహాన్ని తీసుకొని తమ సొంత గ్రామానికి (సాగర్ సమీప ప్రాంతం) వెళ్లారు.
అయితే ఘటన విషయాన్ని స్థానికులు హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న మృతదేహాన్ని మార్గమధ్యంలో (సాగర్ రోడ్డు) లో అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు నిందితుడైన బాలుడిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలిక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను ఆరా తీస్తున్నారు.
Follow Us