/rtv/media/media_files/2026/03/17/tgpsc-2026-03-17-14-53-48.jpg)
TGPSC
TGPSC: గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి నూతన సంస్కరణలు తీసుకురావాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రొఫెషనల్ కేటగిరీ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) నియామక పరీక్షలు నిర్వహించాలని, పరీక్ష రాసిన వెంటనే అభ్యర్థులకు ప్రైమరీ మార్కులు ఇవ్వాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఇక ముందు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్న కమిషన్, ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. తెలంగాణలో నియామక పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువరించడం మొదలు దరఖాస్తుల స్వీకరించడం, పరీక్షల నిర్వహించడం, ఫలితాల వెల్లడించడం, ఆ తర్వాత ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఇలా అన్ని ప్రక్రియలు పూర్తయి తుది జాబితా ప్రకటించడానికి ఏడాదికి పైగా సమయం పడుతోంది. అంత సవ్యంగా సాగితే ఒకే, కానీ, ఒకవేళ ఏదైనా న్యాయవివాదాలు తలెత్తినట్లయితే రెండేళ్లు కూడా పడుతుంది. ఇక మీదట ఇలా జరగకుండా ఉండడానికి పరీక్ష నిర్వహణ, ప్రాథమిక కీ, ఫలితాల వెల్లడికి కొత్త విధానాన్ని అమలు చేయడానికి టీజీపీఎస్సీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తీసుకు వచ్చిన సంస్కరణలో భాగంగా గ్రూప్-1, 2, 3 పరీక్షల ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో 1:2 నిష్పత్తి విధానాన్ని ఎత్తేసి 1:1 విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం విజయవంతం కావడంతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకయ్యే సమయం సగానికి సగం తగ్గిపోయింది.
ఇక మీదట టీజీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒకేసారి ఎగ్జామ్స్ ఉంటే మూడు నెలల్లో..రెండు దఫాలుగా ఉంటే ఆరునెలల్లో నియామకాలు పూర్తి చేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్స్ మినహా ఒకే కేటగిరీ పరీక్షలు ఉండే ఇంజినీరింగ్, ఇతర కేటగిరీ పోస్టుల్లో ఈ విధానం అమలు చేయాలని భావిస్తోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్థి పరీక్ష పూర్తవగానే స్క్రీన్‌పై ఎన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు? అందులో ఎన్ని సరైనవి? ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు ప్రత్యక్షమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో వెంటనే తెలియడంతో.. అక్కడున్న పోస్టులు, మెరిట్ ఆధారంగా పోస్టు వస్తుందా? లేదా? ఇతర పోటీపరీక్షలకు సిద్ధం కావాలా? అనేది అభ్యర్థులు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అదేరోజున ప్రిలిమినరీ కీ విడుదల చేసిన తరువాత.. ఏవైనా మార్పులుంటే తుది కీ వెలువడుతుంది. ఓటీఆర్ సవరణతో అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయాలి. అప్పటికే టీజీపీఎస్సీ వాటిని యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి ద్వారా వెరిఫికేషన్ చేసి ఉండటం వల్ల అభ్యర్థుల పూర్తి సమాచారం ఓటీఆర్‌లో నిక్షిప్తమవుతుంది. తద్వారా పరీక్ష పూర్తయిన వారం నుంచి 15 రోజుల్లోనే తుది ఎంపికలు పూర్తిచేయడానికి వీలవుతుందని కమిషన్ భావిస్తోంది.
Follow Us