/rtv/media/media_files/2026/06/04/fire-accident-2026-06-04-13-43-35.jpg)
Major fire accident on Ameerpet Main Road
BIG BREAKING: హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్‌పేట మెయిన్ రోడ్డులో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రీవనం, మెట్రో పిల్లర్ నంబర్ 1043 కి సమీపంలో ఉన్న ‘కేఎస్‌ఆర్ (KSR) ఫ్యాషన్స్’ అనే మూడు అంతస్తుల బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు, క్షణాల వ్యవధిలో నిలువెల్లా వ్యాపించి భవనం మొత్తాన్ని కమ్మేశాయి. దుకాణంలో అంతా దుస్తులు (టెక్స్‌టైల్స్) కావడంతో మంటల తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగింది. భగభగ మండుతున్న అగ్నికీలలు, దట్టమైన నల్లటి పొగ మైత్రీవనం జంక్షన్ పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2026
హైదరాబాద్ - మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం
భారీగా ఎగసిపడుతున్న మంటలు.. దట్టంగా అలుముకున్న పొగ
కమర్షియల్ కాంప్లెక్స్‌లోని హెల్మెట్ షోరూంలో చెలరేగిన మంటలు
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/cFRoUNmShZ
వేసవి తీవ్రత, ఎండల వేడి తోడవడంతో ఈ మంటలు పక్కనే ఉన్న ఇతర వ్యాపార సముదాయాలకు వేగంగా విస్తరించాయి. ప్రమాదం జరిగిన భవనం చుట్టుపక్కల హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్లు, మొబైల్ షాపులు వంటి వందలాది దుకాణాలు ఉండటంతో ముప్పు మరింత ఎక్కువైంది. మంటలు తమ షాపులకు ఎక్కడ అంటుకుంటాయోననే భయంతో పక్కనే ఉన్న వ్యాపారులు హుటాహుటిన తమ దుకాణాల్లోని విలువైన వస్తువులను, ఎలక్ట్రానిక్ పరికరాలను బయటకు తెచ్చి ప్రాణాలు చేతబట్టుకుని పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) June 4, 2026
🚨 Traffic Alert🚨
A fire accident has occurred at KSR Fashions, near Metro Pillar No. A1043, Srinivasanagar West, Ameerpet.
Due to emergency response operations, vehicular movement is affected on the Ameerpet to SR Nagar stretch, resulting in traffic congestion in… pic.twitter.com/tGOSm2IQ5R
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది పలు ఫైర్ ఇంజిన్లతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు పక్కన ఉన్న మరిన్ని భవనాలకు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా షాపింగ్ కాంప్లెక్స్‌లోని మిగిలిన దుకాణాల వారిని, వినియోగదారులను పోలీసులు తక్షణమే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమీర్‌పేట ప్రధాన రహదారిపైనే ఈ ప్రమాదం జరగడం, దట్టమైన పొగ కమ్మేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా ప్రాణనష్టం జరిగిందా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అలాగే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు (షార్ట్ సర్క్యూట్ లేదా ఇతరత్రా) ఇంకా స్పష్టమవ్వలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే ఆస్తి నష్టం అంచనా మరియు ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు జరపనున్నారు. కాగా, ఇదే ఏడాది ఫిబ్రవరి నెలలో మైత్రీవనంలోని 'నీలగిరి బ్లాక్' లోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కూడా అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, కొన్ని నెలల వ్యవధిలోనే మళ్లీ అదే ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాగా ఈ మార్గంలో ప్రయాణించే వారు ఇతర మార్గాల గుండా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రస్తుతం అక్కడ మంటలు ఎక్కువగా ఎగిసిపడుతుండటం, ట్రాఫిక్ అంతరాయం కారణంగా ఇతర మార్గాల్లో తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
Follow Us