వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, కాంగ్రెస్‌కు మూడో స్థానమే: KTR సంచలన వ్యాఖ్యలు

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమై మూడో స్థానానికి పరిమితం కాబోతుందని జోస్యం చెప్పారు.

New Update
ktr brs

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమై మూడో స్థానానికి పరిమితం కాబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తమ అసలైన రాజకీయ ప్రత్యర్థి బీజేపీనే అని ఆయన తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని, అయితే రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎంతగానో మేలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో హైడ్రా పేరుతో అధికారులు, పాలకులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి భవిష్యత్తు లేదని, ఆయన ఎంతో ప్రకటించిన ఫ్యూచర్ సిటీకి అంతకంటే భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కక్షపూరితంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి అన్నారు. మున్సిపల్‌ శాఖ సీఎం పరిధిలో ఉందని.. హైదరాబాద్‌లో వర్షం పడి ప్రజలకు ఇబ్బంది ఎదురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. గతంలో 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ.. నగరాన్ని అద్దంలా మాకు అప్పగిస్తే.. మేం చెడగొట్టామా? అని ఎద్దేవా చేశారు.

త్వరలోనే భారీ బస్సు యాత్ర

పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే భారీ బస్సు యాత్ర చేపట్టబోతున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించిన సమయాన్ని, రూట్ మ్యాప్‌ను కేసీఆర్ స్వయంగా నిర్ణయిస్తారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 60 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై కీలక సమావేశాలు పూర్తి చేశామని, మిగిలిన 59 నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే నెల నుండి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వివరించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను టెక్నికల్ కారణాలతో తిరస్కరించడం సరికాదని కేటీఆర్ అన్నారు. ఈ నామినేషన్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచే సమాచారం లీక్ అయిందని మహారాష్ట్ర మంత్రి స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలను ముంచేలా వ్యవహరించిన తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ బ్లాక్ షీప్ ఎవరో కాంగ్రెస్ అధిష్ఠానం, రాహుల్ గాంధీనే తేల్చాలని కేటీఆర్ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు