Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రణీత్‌రావు డీఎస్పీ హోదా రద్దు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

New Update
FotoJet - 2026-02-04T072654.116

Praneeth Rao's DSP status revoked

Phone tapping case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన  ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు సస్పెన్షన్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఆయన డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత ప్రొబేషన్‌ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.  ఈ మేరకు ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హోదా రద్దుతో ఆయనకు గతంలో కల్పించిన యాక్సిలరేటెడ్‌ పదోన్నతి రద్దయింది. ప్రస్తుతం ఆయన ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగుతారు.

సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్‌ పదోన్నతి కల్పిస్తారు. కానీ, ఆయన అలాంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినప్పటికీ నాటి ప్రభుత్వం  ప్రణీత్‌రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడం వివాదస్పదమైంది. 2007 బ్యాచ్‌లో దాదాపు 300 మంది ఎస్సైలు ఉండగా.. ఒక్క ప్రణీత్‌రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించడం చర్చనీయంశమైంది. కేవలం ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినందుకే ప్రణీత్‌రావుకు పదోన్నతి కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రణీత్‌రావు ఎస్సై హోదాలో 2016 అక్టోబరు 24న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)కు బదిలీ అయ్యారు. అక్కడ 2023 డిసెంబరు 13 వరకు పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఇన్‌స్పెక్టర్‌గా, యాక్సిలరేటెడ్‌ విధానంలో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఎస్‌ఐబీలో ఆయన నేతృత్వంలోనే స్పెషల్‌ ఆపరేషన్స్‌ టార్గెట్‌(ఎస్‌వోటీ) ఏర్పాటైంది. 

ఇక 2023 శాసనసభ ఎన్నికల రిజల్ట్స్‌ అనంతరం ఎస్‌ఐబీ భవనంలోని సీసీ కెమెరాలను స్విచ్‌ఆఫ్‌ చేసి, ఎస్‌వోటీ లాగర్‌రూంలోని ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలోని 42 హార్డ్‌డిస్క్‌లు, అందులోని డేటాను ధ్వంసం చేశారని ప్రణీత్‌రావుపై ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ నేరం  ‘ఇది టీఎస్‌సీఎస్‌(కాండక్ట్‌) రూల్స్, 1964లోని రూల్‌ నంబర్‌ 3 ఉల్లంఘన కిందకు వస్తుందని, వెంటనే అతన్ని సస్పెండ్‌ చేయాలి’ అని ఎస్‌ఐబీ అప్పటి డీఐజీ సూచన మేరకు.. ఇంటెలిజెన్స్‌ విభాగం నాటి అదనపు డీజీపీ 2024 జనవరి 17న ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో అదే ఏడాది మార్చి 2న ప్రణీత్‌రావును సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉండగానే మార్చి 10న ఆయనపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో 12న అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో పదోన్నతి రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి  డీజీపీ నివేదిక అందించారు. 2023 మార్చి 31న డీఎస్పీగా యాక్సిలరేటెడ్‌ పదోన్నతి పొందిన ప్రణీత్‌రావు..కేవలం ఏడాది కాలంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీ తన నివేదికలో కోరారు. దీంతో ఆయన డీఎస్పీ పోస్టును రద్దు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు