/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-07-11-42.jpg)
Kavitha's big shock to BRS
TRS : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) గా ప్రకటించి, సొంత పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ వేదికగా ఉన్న 'టీఆర్‌ఎస్' పేరు ఇప్పుడు కవిత చేతికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలని కేసీఆర్, కేటీఆర్ భావిస్తున్న తరుణంలో.. కవిత ముందే ఆ పేరును తన పార్టీ కోసం ప్రకటించి 'చెక్' పెట్టారు. కవిత చివరి నిమిషం వరకు 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) పేరును ప్రచారంలో ఉంచి, ఆవిర్భావ సభలో ఒక్కసారిగా 'TRS' పేరును బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో 'టీఆర్‌ఎస్' పేరుకు ఉన్న ఆదరణను, ప్రజల్లో ఉన్న 'ఇంటి పార్టీ' గుర్తింపును తన వైపు తిప్పుకోవడమే కవిత ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
పార్టీ పేరు విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు లేదా ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎదుర్కోవడానికి కవిత ముందుగానే జాగ్రత్త పడ్డారు.పార్టీ పేరు కింద చిన్న అక్షరాలతో 'అసోసియేషన్' అని చేర్చారు.ఒకవేళ పాత టీఆర్‌ఎస్‌తో ఇబ్బంది వస్తే, తన పార్టీని టీఆర్‌ఎస్ (A) గా కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కేసీఆర్ దూరం చేసుకున్న 'టీఆర్‌ఎస్' బ్రాండ్‌ను కవిత సొంతం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో బీఆర్‌ఎస్ కేడర్ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య లేదా అన్నచెల్లెళ్ల మధ్య ఈ పేరు గొడవ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
అభ్యంతరం లేదన్న ఈసీ
కాగా, తెలంగాణలో ‘టీఆర్‌ఎస్’ సంక్షిప్త పదాలతో మరో పార్టీ ఉన్నప్పటికీ తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రాష్ర్ట ఎన్నికల కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. టీఆర్‌ఎస్ సంక్షిప్త పదం మరో పార్టీ విషయంలోనూ ధ్వనించవచ్చని, అలాగే, టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) మాదిరిగా కొత్తగా ఏర్పడిన టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) ధ్వనించినా పెద్దగా అభ్యంతరం ఉండదని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. పార్టీ పూర్తి పేర్లే తమకు ముఖ్యమని, వాటి సంక్షిప్త పదాలు తమకు ముఖ్యం కాదని ఎన్నికల కమిషన్‌కు చెందిన అధికారి ఒకరు వెల్లడించడం విశేషం. అలాగే బీఆర్‌ఎస్ తమ పార్టీ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చుకోవచ్చునని, దానికి కూడా తమకు అభ్యంతరం ఉండదని ఆయన వెల్లడించారు. సంక్షిప్త పదాలు ఒకే విధంగా ధ్వనించే పార్టీల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉందని, ‘భారతీయ’ అన్న పదం ఉన్న పార్టీలు, ‘జనతా’ అన్న పదం ఉన్న పార్టీలు కూడా దేశంలో ఎన్నో ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే కాంగ్రెస్ అన్న పదం చివరగా ఉన్న పార్టీలు అనేకం ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు తేల్చి చెప్పడంతో బీఆర్‌ఎస్ వర్గాలు సందిగ్ధంలో పడ్డాయి.
Follow Us