Karimnagar : ఉమ్మడి కరీంనగర్‌ వేదికగా..ఉత్కంఠ రాజకీయం..

 తెలంగాణ రాజకీయాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతుండగా, దానికి ఏమాత్రం తగ్గని రీతిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు నేడు పోటాపోటీ సభలకు సిద్ధమయ్యాయి.

New Update
KCR Vs Revanth

kcr vs revanth

 Karimnagar : తెలంగాణ రాజకీయాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతుండగా, దానికి ఏమాత్రం తగ్గని రీతిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు నేడు పోటాపోటీ సభలకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే రోజు, దాదాపు ఒకే సమయంలో ఒకే ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ నెలకొన్నది. ఇరు పార్టీలు ఈ సభలను తమ సత్తా చాటేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంథని నియోజకవర్గ పర్యటనలో భాగంగా తొలుత మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన వైఫల్యాలను, బ్యారేజీ కుంగుబాటును ప్రజలకు మరోసారి గుర్తుచేసే వ్యూహంతో ప్రభుత్వం ఈ పర్యటనను ఖరారు చేసింది. అనంతరం కాటారంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే రెండో విడత రైతుభరోసా నిధులను విడుదల చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చాటిచెప్పే ప్రయత్నం చేయనున్నారు. సుమారు లక్ష మందితో ఈ సభను నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టాయి.

మరోవైపు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీనియర్ నాయకులు టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతున్న సందర్భంగా జగిత్యాలలో ‘జగిత్యాల జైత్రయాత్ర’ పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని గులాబీ దళం భావిస్తోంది. కేటీఆర్, హరీశ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ సభకు జగిత్యాల పరిసర నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తరలించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం ఈ సభలో ప్రధాన ఘట్టంగా నిలవనుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో, ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలు,పరిపాలనా వైఫల్యాలపై కేసీఆర్ ఎలాంటి విమర్శలు గుప్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై ఆయన గళం విప్పే అవకాశం ఉంది. అదే సమయంలో గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత కొత్త పార్టీ ప్రకటన చేయడం వంటి అంతర్గత పరిణామాల మధ్య కేసీఆర్ ప్రసంగం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించనున్నారు.

ఎండల తీవ్రత దృష్ట్యా ఇద్దరు నేతలూ సాయంత్రం వేళల్లోనే ప్రసంగించేలా షెడ్యూల్ రూపొందించుకోవడం గమనార్హం. కేసీఆర్ సభ రోజే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనను పెట్టుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు, సవాళ్లకు ప్రతిసవాళ్లతో కరీంనగర్ గడ్డ నేడు హోరెత్తనుంది. సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం కానుండగా, కేసీఆర్ తన ప్రసంగం ద్వారా బీఆర్ఎస్ పునరుజ్జీవానికి బాటలు వేయాలని చూస్తున్నారు. ఈ రెండు సభల ప్రభావం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై స్పష్టంగా కనిపించనుంది.

Advertisment
తాజా కథనాలు